చిక్కుతున్నా ఆగని అవినీతి ఏసీబీ దాడులతో అవినీతిపరుల గుండెల్లో వణుకు పట్టుబడుతున్నా తీరుమారని అధికారులు తాజాగా ఏసీబీకి చిక్కిన వేములవాడరూరల్ తహసీల్దార్
సిరిసిల్ల: నిబంధనల మేరకు చేయాల్సిన పనులకూ సైతం పైసలిస్తేనే చేస్తామనే ధోరణి అధికారుల్లో ఇటీవల పెరిగిపోయింది. పాపభీతి లేకుండా లంచాల కోసం సామాన్యులను సైతం వేధించుకు వసూలు చేస్తున్నారు. ఇలా లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నా కక్కుర్తి ఆగడం లేదు. డబ్బుల కోసం వేధిస్తున్న అవినీతి చేపలు జిల్లాలో తరచూ చిక్కుతున్నాయి. తాజాగా వేములవాడ రూరల్ తహసీల్దార్ ఎండీ అబూబాకర్, రెవెన్యూ ఆఫీస్లోని భూభారతి ప్రైవేటు వ్యక్తి సంకసాల అనిల్కుమార్ గురువారం రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తరచూ ఏసీబీ దాడులు జరుగుతున్నా లంచావతరాలు మాత్రం మానుకోవడం లేదు.
వరుస సంఘటనలు
పెచ్చుమీరిన అవినీతి
లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నా అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం తీసుకోవడం చట్టభద్దమైన హక్కులాగా భావిస్తూ అందినకాడికి గుంజుతున్నారు. ఇది తప్పు అనే విషయాన్నే కొందరు అధికారులు ఎప్పుడో మరిచిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు బాధితులతో ఫిర్యాదులు స్వీకరిస్తూ డబ్బులను ఎరగా చూపుతూ అవినీతి చేపలను పట్టుకుని జైలుకు పంపుతున్నారు. అయినా అధికారుల్లో మార్పు రావడం లేదు. అవినీతి అధికారులను పక్కాగా పట్టించడంలో ప్రజాచైతన్యం వెల్లువెత్తుతోంది. ఆ చైతన్యమే అవినీతి అధికారులు జైలు ఊచలు లెక్కించేలా చేస్తుంది.


