వేములవాడలో సర్వం సిద్ధం
రూ.36 లక్షలతో ప్రత్యేక ఏర్పాట్లు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలో ఏడొద్దుల సద్దుల సంబురాలకు సర్వం సిద్ధమయ్యాయి. ఆడపడచులు బతుకమ్మలు పేర్చుకునేందుకు పూలను సిద్ధం చేసుకోగా.. వారి కోసం మూలవాగు బతుకమ్మ తెప్ప వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రూ.36 లక్షలతో మున్సిపల్ అఽధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురవారం సాయంత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్ లోకేశ్, మేనేజర్ సంపత్‌రెడ్డి తదితరులు పనులు పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. బైపాస్‌రోడ్డు, ప్రధాన కూడళ్లు, మూలవాగుతీరం పూలజాతరను తలపిస్తుంది.
బైపాస్‌రోడ్డు పూల జాతర
వేములవాడలో ఏడొద్దులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్న సందర్భంగా జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి రైతులు పూలను ట్రాక్టర్లలో తీసుకొచ్చి గురువారం రాత్రి వరకు విక్రయించారు. దీంతో మూలవాగు ఒడ్డున ఉన్న బైపాస్‌రోడ్డంతా పూలవనంలా మారింది. పురవాసులు పెద్ద ఎత్తున పూలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
సద్దుల వేడుకలకు సినీ నటులు
శుక్రవారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు సినీనటులు సాయికుమార్, రామ్‌జగన్ హాజరవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ తెలిపారు.
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మూలవాగులోని బతుకమ్మతెప్ప ప్రాంతం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపారు. కోరుట్ల వైపు వెళ్లే వాహనాలు, సిరిసిల్ల–కరీంనగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు అమరవీరుల స్తూపం నుంచి మున్నూరుకాపు సత్రం, సాయిరక్షా దాబా, పెద్దమ్మ టెంపుల్, చెక్కపల్లి బస్టాండ్, పాపన్నచౌక్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వివరించారు. కోరుట్ల వైపు నుంచి వచ్చే వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్లాలని తెలిపారు.


