● డీఎస్పీ శ్రీనివాసులు
వేములవాడ అర్బన్: క్షుద్రపూజలు, చేతబడులు, మంత్రాలు, తాయత్తులతో అనారోగ్య సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం రాత్రి వేములవాడ మండలం చీర్లవంచ, అగ్రహారం, తెట్టెకుంటల్లో మంత్రాలు, తాయత్తులు కట్టే వారి కోసం దాడులు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మంత్రాలు, తాయత్తులతో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తామంటూ ప్రజలు మోసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సోదాల్లో నాటు వైద్యానికి సంబంధించిన మూలికలు, తాయత్తులు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు, వివిధ రకాల పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీఐలు బి.వీరప్రసాద్, శ్రీనివాస్, సబ్ డివిజన్ ఎస్సైలు రమేశ్, రామ్మోహన్, శ్రీనివాస్, రాహుల్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


