మిడ్‌మానేరు నీటిని విడుదల చేయాలని బ్రిడ్జిపై ధర్నా
త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని నిరసన
నిజామాబాద్‌లో ధర్నా చేస్తున్న రైతులు
పొత్తూరు మానేరువాగు బ్రిడ్జిపై రైతుల ధర్నా
ఇల్లంతకుంట(మానకొండూర్): నారుమడులు ఎండిపోతున్నాయని.. పంటలను కాపాడాలని కోరుతూ రైతులు గురువారం రోడ్డెక్కారు. మిడ్‌మానేరు నీటిని విడుదల చేయాలంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు. తాగునీటి కోసం తిప్పలైతుందని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినపల్లి ఎస్సైలు అక్కడికి చేరుకొని రైతులతో ధర్నా విరమింపజేశారు. జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సీహెచ్.రాజిరెడ్డి, సర్పంచులు బద్దం శేఖర్‌రెడ్డి, మాన్వాడ సర్పంచ్ కట్ట గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచులు కమటం రాములు, బిళ్లవేని పరుశురాం, ఉపసర్పంచ్ బండారి నరేశ్ పాల్గొన్నారు.
త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలి
కోనరావుపేట(వేములవాడ): వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ మండలంలోని నిజామాబాద్ క్రాసింగ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. త్రీ ఫేజ్ కరెంట్ సరఫరా లేక పంటలకు నీరందడం లేదన్నారు. సర్పంచ్ మల్యాల స్వామిదాసు, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ అనుపాటి భూమిరెడ్డి, నాయకులు వంగపల్లి శ్రీనివాస్, జిల్లెల్ల లక్ష్మారెడ్డి, వెంకన్న, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్ ఎదుట రైతుల నిరసన
వీర్నపల్లి(సిరిసిల్ల): విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వీర్నపల్లి మండలం అడవిపదిర రైతులు స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.


