● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో నక్షా భూసర్వే గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూముల రీసర్వే షెడ్యూల్ ప్రకారం చేయాలన్నారు. అవసరమైన యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించాలన్నారు. నక్ష సర్వే గడువులోగా పూర్తి చేయాలన్నారు. అంతకుముందు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. భూభారతి చట్టం, సాదాబైనామాలు, నిషేధిత జాబితాలోని భూములు, మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు, పెండింగ్ డబుల్ బెడ్రూం ఇళ్లు, గుడిసెల్లో ఉండే వారికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. విద్యార్థులకు స్కూల్ యూనిపామ్స్ పంపిణీ చేయాలని కోరారు. జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, సర్వే ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ సేవల్లో విధులు నిర్వహిస్తున్న పైలట్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌కు డీఎంహెచ్‌వో నిర్వహించిన పునశ్చరణ శిక్షణ, నైపుణ్య శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ ఆధ్వర్యంలో శిక్షణ అధికారులు టి.సమన్, బత్తిని మహేశ్ అత్యవసర వైద్యసేవల్లో పాటించాల్సిన ఆధునిక విధానాలపై శిక్షణ ఇచ్చారు. సీపీఆర్ నిర్వహణ, తీవ్ర రక్తస్రావాన్ని నియంత్రించే పద్ధతులు, ప్రమాదాల్లో గాయపడిన వారికి అందించాల్సిన ట్రామాకేర్‌పై అవగాహన కల్పించారు. జిల్లా మేనేజర్ సావనపెల్లి అరుణ్‌కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, మామిడాల ఆంజనేయులు, పోచంపల్లి పరశురాములు, బుర్ర వెంకటేశ్, తోట నరేందర్, మైల కుమారస్వామి, సామల అనిల్, రేగుల బాబు, స్వాతి, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించడం, ప్రాథమిక ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు శనివారం హెల్పింగ్‌హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫీల్డ్‌క్యాంప్ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కుటుంబాల ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, పోషకాహారలోపం, వ్యక్తిగత పరిశుభ్రత, తల్లి–శిశు ఆరోగ్యం సమాచారం సేకరించారు. హెల్పింగ్‌హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రముఖ సైకాలజిస్ట్ పున్నం చందర్, దాసరి తిరుమల, సుమంత్, వార్డు కౌన్సిలర్ మామిడాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రంలో బుల్లితెర తారలు శనివారం సందడి చేశారు. ఓ ప్రైవేటు చానల్ ఈవెంట్ సందర్భంగా నటులు శ్రీరాంవెంకట్, వర్షిణి, ప్రసాద్‌బాబు, శ్రీప్రియ, సరస్వతి, రాఘవ, సంగీత తదితరులు పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివనగర్ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అధ్యక్షుడు సిరిపురం కృష్ణ తదితరులు స్వాగతం పలికారు.


