● కాగితపు రశీదులకు స్వస్తి ● దరఖాస్తుదారుడి ఫోన్‌కి హైపర్ లింక్
గంభీరావుపేట(సిరిసిల్ల): మీసేవ కేంద్రాల్లో ఇక పేపర్ ప్రింటింగ్స్ కనిపించవు. కులం, ఆదాయం, నివాస సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇక రశీదులు ఇవ్వరు. రశీదుల స్థానంలో దరఖాస్తుదారుల ఫోన్‌కు మెసేజ్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారానే దరఖాస్తుదారుడు సేవ వివరాలు చూసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 92 మీసేవ కేంద్రాల్లో ఇక రశీదులకు బదులు లింక్ పంపిస్తున్నారు.
మొబైల్‌కు రశీదు లింకు
మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే దరఖాస్తుదారుడు ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. అప్లికేషన్ నంబరు, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతోపాటు ఒక హైపర్‌లింక్ వస్తుంది. దరఖాస్తుదారులు ఆ లింకుపై క్లిక్ చేసి వారి రశీదును ఎప్పుడైనా చూసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు డౌన్‌లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చే వరకు ఈ మెసేజ్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
స్పష్టమైన ఆదేశాలు
మీసేవ కేంద్రాలకు నూతనంగా వచ్చిన నిబంధన ప్రకారం మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తుదారుల నుంచి ఖచ్చితమైన, పనిచేస్తున్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. గత నెల 19వ తేదీ నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు) రశీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి పాత పద్ధతిలో కాగితం రశీదులు జారీ చేస్తే సదరు కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్‌లో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తిరిగి పంపించే సౌకర్యం
మొబైల్‌కు వచ్చిన మెసేజ్ పొరపాటున డిలీట్ అయినా లేదా పోయిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీసేవ అప్లికేషన్‌లో సదరు మెసేజ్ తిరిగి పంపించే సౌకర్యం కల్పించారు. దరఖాస్తుదారులు కోరితే ఆపరేటర్లు మళ్లీ మెసేజ్ పంపించే అవకాశం ఉంది.


