మన బాలగాయనే.. గానకోకిల! | - | Sakshi
Sakshi News home page

మన బాలగాయనే.. గానకోకిల!

Jul 12 2026 3:35 AM | Updated on Jul 12 2026 3:35 AM

● సిరిసిల్లలోనే తొలి వేదికపై పాడిన జానకి ● సంగీతంలోనూ శిక్షణ

సిరిసిల్ల: గానకోకిల ఎస్‌.జానకి బాల్యం సిరిసిల్లలోనే సాగింది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు 1938 ఏప్రిల్‌ 23న జన్మించిన జానకీ.. 1945 ప్రాంతంలో సిరిసిల్లలో ఉన్నారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా కార్మికక్షేత్రానికి వచ్చారు. సిరిసిల్లలోనే జానకి సంగీత ఓనమాలు నేర్చుకున్నారు. తన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే సాగింది. స్థానిక నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి ఆమెకు మెళకువలు నేర్పారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే సిరిసిల్లలో మొట్టమొదటి సారిగా స్టేజీ ఎక్కి పాట పాడారు. తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఎండ్లబండిలో వేములవాడకు వెళ్లి ‘బాలనాగమ్మ’ సినిమా చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సినిమాలోని పాటలను అచ్చంగా అలాగే అనుకరిస్తూ.. ఏడుస్తూ.. పాడటంతో అందరూ అభినందించారని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ పాట కోసం తనను పలువురు ఇళ్లలోకి పిలుచుకుని పాడించుకునే వారని చెప్పారు. సిరిసిల్ల వీధుల్లో పెరిగిన జానకి ఆ తర్వాత మద్రాసు(చైన్నె) చేరుకుని వేలాది పాటలు పాడి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే దిగ్గజ గాయనిగా ఎదిగారు. సంగీత ప్రయాణానికి పునాది వేసిన ప్రాంతంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

బాల్య స్మృతులు వెతుక్కుంటూ సిరిసిల్లకు..

గాయని జానకి తన బాల్య స్మృతులను వెతుక్కుంటూ 2002లో సిరిసిల్లకు వచ్చారు. 64 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన ఆమె చిన్నప్పుడు మెదిలిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ పరిసరాల్లోనే తాను ఆడుకున్నానని, ఉదారువాగు నుంచి మంచినీటిని బిందెళ్లో తెచ్చేవారమని గుర్తుచేశారు. అప్పటి సిరిసిల్ల సీఐ ఉమామహేశ్వరశర్మ గాయని ఎస్‌.జానకిని సత్కరించారు. జానకి మరణించినట్లు తెలియడంతో పలువురు సిరిసిల్ల వాసులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement