నీరుంటే నారు పోసుకోవచ్చు | - | Sakshi
Sakshi News home page

నీరుంటే నారు పోసుకోవచ్చు

Jun 8 2026 11:54 PM | Updated on Jun 8 2026 11:54 PM

పత్తిని ఇప్పుడే విత్తుకోవద్దు భూమిలో తేమ ఉంటేనే విత్తుకోవాలి

యాజమాన్య పద్ధతులు పాటిస్తే సన్నాల్లోనూ దిగుబడి

విత్తనాలు, ఎరువుల రశీదులు దాచుకోవాలి

‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం

సిరిసిల్ల: జిల్లాలో మంచి వర్షాలు ఇంకా పడలేదు.. భూమి బాగా నానాలి.. వేడి తగ్గాలి.. భూమిలో తేమ ఉంటేనే ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది.. నీరుంటే నారు పోసుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ ఆఫీస్‌లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ‘సాక్షి’ నిర్వహించిన ‘ఫోన్‌ఇన్‌’లో రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఎప్పుడూ ఒకే పంటను వేయొద్దని, పంట మార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. దొడ్డు వడ్లకు బదులు సన్నవడ్లు వేసుకుంటే మంచిదన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది రైతులు ఫోన్‌ చేసి సాగులో సందేహాలకు సమాధానాలు పొందారు.

ఆ విశేషాలు ఇవీ..

ప్రశ్న: డీఏపీ దొరకడం లేదు. ఎరువుల కోసం షాపులకు వెళ్తే ఆన్‌లైన్‌ అంటున్నారు.. ఎలా?

– శ్రీనివాస్‌–వేములవాడ, కట్ట తిరుపతి–తడగొండ, వినయ్‌–రుద్రంగి, బాలరాజు–ముస్తాబాద్‌.

డీఏవో: ఇప్పుడే వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. డీఏపీ అవసరం ఇప్పుడే ఉండదు. అయినా ముందుచూపుతో రైతులు ఆలోచించడం మంచిదే. యూరియా, డీఏపీ ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. గాలిలో భాస్వరం ఉంటుంది. సహజంగా నేలలో లభించే పోషకాలతోనే పంటలు పండాలి. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. పొలంలో పెంటతోపాటు బయో ఫెర్టిలైజర్‌ వేసుకుంటే భూమిని గుల్ల చేస్తుంది. రైతులు ఎరువుల వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నాం.

ప్రశ్న: సన్న వరి విత్తనాలు, కంది విత్తనాలు ఏమైనా వ్యవసాయశాఖ సబ్సిడీపై సరఫరా చేస్తుందా?

– ఎగుమామిడి వెంకటరమణారెడ్డి–తంగళ్లపల్లి, దేవేందర్‌–బావుసాయిపేట, వామన్‌రెడ్డి–వంతడ్పుల, యాదగిరిరెడ్డి–ఆవునూర్‌, నరేందర్‌రెడ్డి–వేములవాడ అర్బన్‌.

డీఏవో: వ్యవసాయశాఖ ద్వారా సబ్సిడీపై ఏ విత్తనాలు సరఫరా కావడం లేదు. కంది వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. మార్కెట్‌లో చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఏది వేసుకున్నా మంచి దిగుబడి వస్తుంది. దొడ్డు వడ్ల కంటే సన్నాలు వేసుకుంటేనే డిమాండ్‌ ఉంటుంది.

ప్రశ్న: ఆరుతడిగా కంది, మొక్కజొన్న వేసుకోవచ్చా?

– రవి–తంగళ్లపల్లి, తిరుపతిరెడ్డి–బండపల్లి, యామ తిరుపతి–వేములవాడ

డీఏవో: ఆరుతడిగా మొక్కజొన్న, కంది వేసుకోవచ్చు. మార్కెట్‌లో మంచి దిగుబడిని ఇచ్చే రకాలు ఉన్నాయి. ఎక్కువ రైతులు సాగు చేస్తే పంటకు కోతుల బెడద కూడా ఉండదు. పెసర్లు, బబ్బర, అలసంద వంటివి సాగు చేయవచ్చు.

ప్రశ్న: మా మండలంలో వ్యవసాయాధికారులు లేరు. రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే వారు కరువయ్యారు?

– బోయిని రవి–వీర్నపల్లి.

డీఏవో: నిజమే వ్యవసాయాధికారి లీవులో వెళ్లారు. ఏఈవోను కేటాయించాం కానీ విధుల్లో చేరలేదు. జిల్లాలో వ్యవసాయాధికారుల కొరత ఉంది. రెండు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.

ప్రశ్న: ఈ సీజన్‌లో సన్నవడ్లు వేసుకోవాలా.. దొడ్డు వడ్లు వేసుకోవాలా?

– రాజవీర్‌–గంభీరావుపేట, దొంతరవేణి శ్రీనివాస్‌గౌడ్‌–నిమ్మపల్లి, మహేశ్‌–బోయినపల్లి, ఎ.రవి–రుద్రంగి, గాంతుల మహేశ్‌–ముస్తాబాద్‌, వెంకటేశ్‌–లింగంపల్లి, నర్సింహారెడ్డి–ఆవునూర్‌, లక్ష్మారెడ్డి–పదిర, పర్శరాంరెడ్డి–నారాయణపూర్‌, భూపతిరెడ్డి–వంతడ్పుల, ఎం.రాజు–చందుర్తి, సత్యంరెడ్డి–ఆవునూర్‌

డీఏవో: ఈ వర్షాకాలంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడి డ్రై స్పెల్‌ మూలంగా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. 120 రోజుల్లో కోతకు వచ్చే స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మంచిది. సన్నవడ్లు వేసుకోవాలని చెబుతున్నాం. రైతులు తమకున్న పొలంలో 75 శాతం సన్నాలు, 25 శాతం దొడ్డు వడ్లు పెట్టుకున్నా ఫరవాలేదు. నీరు ఉంటే నారు పోసుకోవచ్చు. సన్నరకాలైన కేఎన్‌ఎం 1836, జేజీఎల్‌, జైశ్రీరాం వేసుకుంటే ప్రభుత్వం బోనస్‌ ఇస్తుంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకొని, పంట పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి.

ప్రశ్న: ఈ వర్షాలకు పత్తిని విత్తుకోవచ్చా? పత్తిలో స్వల్పకాలిక రకాలేమిటి?

– కట్ట తిరుపతిరెడ్డి–తడగొండ, మోతె మధుసూదన్‌రెడ్డి–నారాయణపూర్‌, పోగుల రాజిరెడ్డి–కనగర్తి.

డీఏవో: పత్తిని ఇప్పుడే విత్తుకోవద్దు. పూర్తి స్థాయిలో వర్షాలు పడలేదు. భూమి ఇంకా నానలేదు. భూమిలో వేడి ఉంటే విత్తనాలు వట్టిపోతాయి. 50 నుంచి 60 శాతం భూమి తడిసిన తరువాత, తేమ ఉన్నప్పుడే పత్తిని విత్తుకోవాలి. బీటీ కాటన్‌ విత్తుకోవాలి. పత్తిలో స్వల్పకాలిక రకాలు లేవు. ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.

ప్రశ్న: వరిలో దోమపోటును తట్టుకునే రకాలేమైనా ఉన్నాయా? మేలైన యాజమాన్య పద్ధతులు ఏమిటి?

– బండారి శ్రీనివాస్‌–ఇల్లంతకుంట, రమేశ్‌–గంభీరావుపేట, గంగాధర్‌–రుద్రంగి, వంతడ్పుల రమేశ్‌–ఇల్లంతకుంట, మల్లేశం–మరిమడ్ల.

డీఏవో: వరి పంటలో దోమపోటు రాకుండా వంగడాలు లేవు. కానీ ముందుగా థైరం, కార్బడిజంతో విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు కొసలను కత్తిరించి వేరే చోట పూడ్చిపెట్టాలి. నాట్లు వేసే సమయంలో కాలిబాటలు వదిలిపెట్టాలి. ఎండ బాగా సోకి, గాలి బాగా ఆడి వరి పంటకు దోమపోటు రాకుండా ఉంటుంది.

ప్రశ్న: కలుపుమందులు షాపుల్లో ఇవ్వడం లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు?

– గంగారెడ్డి–కనగర్తి

డీఏవో: కలుపు మందులను కొన్నింటిని ప్రభుత్వం నిషేధించింది. ఒక్కో పంటకు ఒక్కో కలుపు నివారణ మందు అవసరం ఉంటుంది. అవసరమైన వాటిని ఇవ్వాలని చెప్పాం. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తేవాలి.

Advertisement
 
Advertisement
Advertisement