పైసలు ఉన్నా పరేషానే! | - | Sakshi
Sakshi News home page

పైసలు ఉన్నా పరేషానే!

Jun 8 2026 11:54 PM | Updated on Jun 8 2026 11:54 PM

● ఖాతాల్లోనే యాసంగి వడ్ల డబ్బులు ● రోజుకు రూ.10వేలు ఇస్తున్న బ్యాంక్‌ అధికారులు ● మొదలైన వానాకాలం సాగు పనులు ● పెట్టుబడి కోసం రైతుల తిప్పలు ● ఆన్‌లైన్‌ చెల్లింపులు తెలియక అయోమయం

● ఖాతాల్లోనే యాసంగి వడ్ల డబ్బులు ● రోజుకు రూ.10వేలు ఇస్తున్న బ్యాంక్‌ అధికారులు ● మొదలైన వానాకాలం సాగు పనులు ● పెట్టుబడి కోసం రైతుల తిప్పలు ● ఆన్‌లైన్‌ చెల్లింపులు తెలియక అయోమయం

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న ఇతను ముస్తాబాద్‌ మండలం మద్దికుంటకు చెందిన రైతు కొరివి చంద్రయ్య. ఇతనికి ఐదెకరాల భూమి ఉంది. యాసంగిలో వచ్చిన ధాన్యం డబ్బులు ఖాతాలో జమకాగా.. ఐదు రోజులుగా రోజూ వస్తూ రూ.10వేల చొప్పున తీసుకుంటున్నాడు. ఈ డబ్బులతో గత పంట హార్వెస్టింగ్‌, హమాలీ ఖర్చులు పోను ఇప్పుడు విత్తనాలు, ఎరువులు, దున్నకాలకు సరిపోతాయంటున్నాడు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వానాకాలం సాగుకు రైతులకు నగదు కష్టాలు మొదలయ్యాయి. యాసంగి ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. చేతిలో నగదు లేక వానాకాలం పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులో రోజుకు రూ.10వేలకు మించి ఇవ్వకపోవడంతో నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, దుక్కి దున్నించడం వంటి వాటికి ఇప్పుడు డబ్బులు అవసరం. కానీ బ్యాంకులో సరైన నగదు లేక రైతులకు మొత్తం ఇవ్వడం లేదు. ఆన్‌లైన్‌ చెల్లింపులు తెలియక పలువురు రైతులు రోజూ బ్యాంక్‌కు వచ్చి గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చొని రోజుకు రూ.10వేల చొప్పున తీసుకెళ్తున్నారు.

బ్యాంక్‌లకు చేరని నగదు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి ఆర్‌బీఐ ఆదేశాలతో ‘చెస్ట్‌’ కరెన్సీ నుంచి అన్ని బ్యాంక్‌లకు నగదు సరఫరా చేస్తారు. ఆర్‌బీఐ నుంచి నగదు సరఫరా లేకపోవడంతో బ్యాంక్‌లకూ రావడం లేదు. స్థానికంగా జరిగిన లావాదేవీలతోనే పక్షం రోజులుగా నెట్టుకొస్తున్నామని బ్యాంక్‌ అధికారి ఒ కరు తెలిపారు. ఇరువై అయిదు రోజులుగా కరీంనగర్‌ నుంచి నగదు సరఫరా కాలేదని సమాచారం. వైన్స్‌, పెట్రోల్‌బంకులు, గ్యాస్‌ కంపెనీలు జమచేస్తున్న నగదుతోనే ఖాతాదారులకు బ్యాంకర్లు సర్దుబాటు చేస్తున్నారు. జిల్లాలోని చాలా బ్యాంక్‌ల్లో నగదు లేదని బోర్డులు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement