● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఎస్పీ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 26 ఫిర్యాదులు రాగా.. ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు ఎస్పీ నేరుగా ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సేవలను ప్రజలకు మరింత దరి చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
బోయినపల్లి(వేములవాడ): గ్రామసభలతో సమస్యలు పరిష్కారమవుతాయని వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి పేర్కొన్నారు. మండలంలోని నీలోజిపల్లి, రామన్నపేట, కొదురుపాక, వరదవెల్లి, జగ్గారావుపల్లిల్లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వహించారు. తహసీల్దార్ చిందం శ్రీనివాస్, ఎంపీడీవో జయశీల, ఎంపీవో శ్రీధర్, ఎంఏవో ప్రణిత పాల్గొన్నారు.
సిరిసిల్ల: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి ఉద్యోగ విరమణ కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ 65 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ విరమణ కల్పిస్తున్నట్లు వివరించారు. వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి నుంచి ఇద్దరు, సిరిసిల్ల పరిధిలో 13 మందికి ఉద్యోగ విరమణ కల్పించామన్నారు. ఎనిమిది మంది అంగన్‌వాడీ టీచర్లు, ఏడుగురు ఆయాలు ఉన్నారని తెలిపారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో జిల్లా సంక్షేమాధికారి ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందే వారు వయసు నిర్ధారణ పత్రాలతో జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రావాలని సూచించారు.
సిరిసిల్ల: మృగశిరకార్తె ప్రవేశించిన తొలిరోజు సోమవారం జిల్లాలో వర్షం కురిసింది. ఇన్నాళ్లు వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం చిరుజల్లులతో ఊపిరిపీల్చుకున్నారు. చిరుజల్లులకే జిల్లా కేంద్రం చిత్తడయింది. పాతబస్టాండులోని నేతన్నచౌక్ వద్ద రోడ్డుపైకి వరదతో కలిసిన మురికినీరు చేరింది. కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి మురికినీటితో నిండింది. వేములవాడ రూరల్ మండలం మల్లారం వద్ద అత్యధికంగా 32.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద 0.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇల్లంతకుంటలో అత్యధికంగా 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... అత్యల్పంగా ముస్తాబాద్ మండలం ఆవునూర్ వద్ద 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తడిసిన ధాన్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి తిమ్మాపూర్ కేంద్రంలోని వడ్లు తడిసిపోయాయి. దాదాపు 60 నుంచి 70 వడ్ల కుప్పలు నీటిలోనే మునిగిపోయాయి. వారం క్రితం రైతులు రోడ్డెక్కినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
రోడ్లపై చెత్త వేయొద్దు
వేములవాడ: వేములవాడలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 5, 6, 7, 8, 9, 10, 20 వార్డుల్లో సోమవారం సభలు నిర్వహించారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఆడపడుచుకు ఇందిరమ్మ చీరలను అందిస్తోందని మున్సిపల్ చైర్మన్ రాజు తెలిపారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను ఇష్టానుసారంగా రోడ్లు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయొద్దన్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, మేనేజర్ సంపత్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.


