మూడేళ్లుగా మూత‘బడి’ | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా మూత‘బడి’

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

విద్యార్థులు వస్తలేరనే నెపంతో పాఠశాల మూసివేత

తిరిగి ప్రారంభించాలని కోరుతున్న గ్రామస్తులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఒకప్పుడు 150 మందితో కళకళలాడిన సర్కారు బడి.. మూతపడి మూడేళ్లైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అధికారులు, నాయకులు పట్టించుకోకపోవడంతో గ్రామంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు వ్యయప్రయాసాలకోర్చి తమ పిల్లలను మండలకేంద్రంలోని ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తున్నారు.

విద్యార్థులు రావడం లేదని..

మండలంలోని రహీంఖాన్‌పేట పెద్ద గ్రామపంచాయతీ. 2,300 జనాభా ఉంటారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో పాఠశాలను మూసివేసి, ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఇతర స్కూళ్లకు కేటాయించారు. కాగా, రహీంఖాన్‌పేట అనుబంధ గ్రామం ఎర్రనర్సుపల్లె ప్రాథమిక పాఠశాల మూతపడగా, గతేడాది తిరిగి ప్రారంభించి 20 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుంది. కానీ, మేజర్‌ గ్రామమైన రహీంఖాన్‌పేట బడిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ఆయా గ్రామాల్లో కూడా..

ఇల్లంతకుంట మండలంలో విద్యార్థులు రావడంలేదని నారెడ్డిపల్లి, చిక్కుడువానిపల్లి, కిష్టారావుపల్లి, గూడెపుపల్లి, కేశన్నపల్లి, తెనుగువాండ్లపల్లి, తెనుగువారిపల్లి గ్రామాల్లో ప్రభుత్వ బడులను మూసివేశారు. మూతపడిన ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు నిరుపయోగంగా మారాయి. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు మండలకేంద్రంలోని ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారు. మేజర్‌ గ్రామాల్లో మూతపడిన సర్కార్‌ బడులను తిరిగి ప్రారంభించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement