వస్త్రపరిశ్రమలకు ప్రభుత్వం అండ | - | Sakshi
Sakshi News home page

వస్త్రపరిశ్రమలకు ప్రభుత్వం అండ

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

సిరిసిల్ల: వస్త్రపరిశ్రమకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. కోటి ఇందిరా మహిళాశక్తి నూతన చీరల ఆర్డర్‌ను అందించామని, గడువులోగా అందించాలన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం చేనేత, జౌళిశాఖ ఇందిరా మహిళాశక్తి కొత్త చీరల రంగులను ఆవిష్కరించి, ఆర్డర్లను వస్త్రోత్పత్తిదారులకు అందించారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వస్త్రపరిశ్రమ సంక్షేమం, ఆర్థిక వృద్ధికి ఈ ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. గత ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్‌ పూర్తి చేసిన వస్త్ర పరిశ్రమ బాధ్యులను అభినందించారు. కొత్త చీరల ఆర్డర్లతో సిరిసిల్లలోని మ్యాక్స్‌ సంఘాలకు ఆరు నెలల పాటు ఉపాధి లభిస్తుందన్నారు. స్థానిక వస్త్రపరిశ్రమకు 25 హెచ్‌పీల వరకు 50 శాతం విద్యుత్‌ రాయితీ, కేటగిరీ మార్పు వంటి సమస్యలను పరిష్కరించామన్నారు. చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ మాట్లాడుతూ చీరలు నాణ్యతగా ఉన్నాయని, రానున్న ఆర్డర్లు సైతం నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ మాట్లాడుతూ స్థానిక వస్త్రపరిశ్రమలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలను మహిళలు ధరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్మికుల శ్రమ, పనితనానికి ఈ చీరలు గుర్తుగా నిలుస్తాయన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు స్వరూప, రాములునాయక్‌, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వరరావు, ఏడీ సంతోష్‌ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో వేగం పెంచాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌తో కలిసి సమీక్షించారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతీ మండలానికి ప్రత్యేకాధికారులను నియమించి ధాన్యం సేకరణ పూర్తి చేయాలన్నారు. ప్రత్యామ్నాయ గోదాముల్లో ధాన్యం దిగుమతికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీల కొరత లేకుండా చూడాలని, వ్యాన్లు, ట్రాక్టర్లలోనూ ధాన్యం తరలించాలన్నారు. డీఆర్డీవో గీత, డీఏవో అఫ్జల్‌ బేగం, డీసీఎస్‌వో బుచ్చిబాబు, పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ నరసింహ, డీటీవో లక్ష్మణ్‌ కుమార్‌, డీసీవో రామకృష్ణ, మార్కెటింగ్‌ అధికారి ప్రకాశ్‌, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్‌, కార్మిక శాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement