● కలెక్టర్ గరీమా అగ్రవాల్
బోయినపల్లి(చొప్పదండి): రైస్‌మిల్లర్లు హమాలీల సంఖ్య పెంచుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్ చేయించుకోవాలని సూచించారు. మండలంలోని జగ్గారావుపల్లిలో సుహాస్ రైస్‌మిల్లును, కొదురుపాక కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. పౌరసరఫరాలశాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేగంగా జమయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఎల్.బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, డీఏవో అఫ్జల్‌బేగం, తహసీల్దార్ షరీఫ్ మొయినొద్దీన్, సర్పంచ్ సుద్దాల మధు పాల్గొన్నారు.
లారీల సంఖ్యను పెంచాలి
వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలం అనుపురంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. ఇప్పటి దాకా ఎంత ధాన్యం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారు, రైస్‌మిల్లులకు ఎంత తరలించారు అని ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకానికి అనుగుణంగా లారీలు సమకూర్చాలని ఆదేశించారు.


