కోనరావుపేట(వేములవాడ): జిల్లాలో వడ్ల కొనుగోళ్ల జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. కోనరావుపేట క్రాసింగ్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఇసుక తరలింపునకు వందల లారీలు వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో లారీల కొరత లేకుండా చూశారన్నారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించి, ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధర్నాలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, సర్పంచ్ మల్లేశ్, ప్యాక్స్ వైస్ చైర్మన్ అనుపాటి భూంరెడ్డి, నాయకులు జవ్వాజి మల్లయ్య, కెంద గంగాధర్, తిక్కల నవీన్, రవీందర్‌గౌడ్, రమణారెడ్డి, శివతేజరావు, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


