గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రజాసంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గంభీరావుపేటలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం హాజరయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 99రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతీ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆదేశించారు. లారీల కొరతను సాకుగా చూపి ధాన్యం రవాణాను ఆపవద్దన్నారు. అవసరమైతే గ్రామాల్లో అందుబాటులో ఉండే ట్రాక్టర్లను ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని సూచించారు. పంట ఉత్పత్తుల కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. జూన్ 15 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మైనర్ రిపేర్లు, తాగునీరు, రన్నింగ్ వాటర్ సౌకర్యాలు పూర్తి చేయించాలని సూచించారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న డైట్ చార్జీలను ఇప్పటికే క్రమబద్ధీకరించామని, ఇకపై ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తామన్నారు. రెసిడెన్షియల్ విద్యాలయాలను జిల్లా అధికారులు నిత్యం సందర్శించి, భోజనం నాణ్యత పరిశీలించాలని సూచించారు.
వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ చార్జీలను యూ నిట్‌కు రూ.2 వరకు తగ్గించేలా ఎన్పీడీసీఎల్ అధి కారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ని ర్మాణంలో రాష్ట్రంలో ముందు ఉన్న సందర్భంగా అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు.
జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలి : తుమ్మల నాగేశ్వర్‌రావు
జిల్లాను అన్ని రంగాల్లో ముందుస్థానంలో ఉంచాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బంది రావద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఒకే వేదికపై అన్ని శాఖలు
జిల్లా కేంద్రం కాకుండా ఇతర ప్రాంతంలో అన్ని శాఖల అధికారులు ఒకే వేదికపై హాజరుకావడం తొలిసారి.


