● కలెక్టరేట్ బాట పడుతున్న బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● 220 దరఖాస్తుల స్వీకరణ
సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో పట్టించుకునే వారు లేక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు కలెక్టరేట్ బాట పడుతున్నారు. సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ అర్జీలు స్వీకరించి భరోసానిస్తున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి 220 దరఖాస్తులు స్వీకరించారు.
మాది ఇల్లంతకుంట మండలం రేపాక. ఇక్కడ ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌లో సన్నవడ్లు గత నాలుగేళ్లుగా కొనుగోలు చేయడం లేదు. నేను 70 క్వింటాళ్ల వరకు సన్నవడ్లు పండించాను. ఈ వడ్లను కొనుగోలు చేసి తగిన మద్దతు ధర కల్పించాలి. – రోండ్ల భూపతిరెడ్డి, రేపాక
మాది సిరిసిల్లలోని శివనగర్. నా భర్త 9 ఏళ్ల క్రితం నన్ను, నా పిల్లలను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇద్దరి పిల్లల పోషణ ఇబ్బందిగా ఉంది. నాకు ఏదైనా పని కల్పించి, పెన్షన్ మంజూరు
చేయండి. – మడత రాధిక, సిరిసిల్ల
మాది బోయినిపల్లి మండలం కొదురుపాక. నా భర్త అనారోగ్యంతో గతేడాది మృతిచెందాడు. మాకు ఇద్దరు చిన్న పిల్లలు. వారి చదువు, పోషణ ఇబ్బందిగా మారింది. నాకు జిల్లాలో ఎక్కడైనా ఏధైనా ఉపాధి కల్పించండి. – సంగీత
మాది తంగళ్లపల్లి మండలం బాలమల్లుపల్లె. మా గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. నిర్మాణాన్ని ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అప్పులు తీసుకొచ్చి నిర్మాణాలు పూర్తిచేశాం. బిల్లులు రాకపోవడంతో వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికై నా బిల్లులు వచ్చేలా చూడాలి.
– బాలమల్లుపల్లె గ్రామస్తులు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కొంతకాలంగా మానువాడ నుంచి ఇసుకను రవాణా చేశాం. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌లో మన ఇసుక మన వాహనం ద్వారా మాకు ఇల్లంతకుంట మండలం పొత్తూరు క్వారీ నుంచి అనుమతి ఇచ్చారు. ఇల్లంతకుంట మండలం వారు మా ట్రాక్టర్లను అనుమతించడం లేదు. కాబట్టి మానువాడ నుంచి ఇసుకకు అనుమతి ఇవ్వాలి. – బోయినపల్లి మండల
ఇసుక ట్రాక్టర్ల యజమానులు


