సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా 19 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి వేగంగా పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. అర్జీదారుల వినతులను స్వీకరించిన ఎస్పీ, సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదులను చట్టపరంగా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): రైసుమిల్లుల దోపిడీని అరికట్టాలని, రైతులకు అన్యాయం చేస్తున్న రైసుమిల్లుల లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, నాగంపేటలకు చెందిన రైతులు సోమవారం పెద్దమ్మ స్టేజీ వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల వరి ధాన్యాన్ని అధికంగా తూకం వేయిస్తూ అన్నదాతలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు.
రైతుల ధర్నా
కోనరావుపేట: ధాన్యం కొనుగోలు చేయాలని మండలంలోని సుద్దాలలో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నామన్నారు.
వేములవాడ: బంగారం విక్రయిస్తున్న దుకాణాల నిర్వాకంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ పట్టణ స్వర్ణకారులు తమ దుకాణాలను సోమవారం బంద్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ తీశారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు గిన్నెల శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యువెల్లరీ దుకాణాల యజమానులు వారి వద్ద బంగారం కొనుగోలు చేసే వినియోగదారులకు తామే ఆభరణాలు కూడా తక్కువ ధరకు తయారు చేసి ఇస్తామంటూ తమ పొట్ట కొడుతున్నారని వాపోయారు. బంగారం విక్రయించే వరకు బాగానే ఉన్నా తమ పనిని కూడా వారే తీసుకొని ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా వైఖరి మార్చుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి కత్రోజు వెంకటేశ్, రాము, ప్రసాద్, శంకరయ్య, కట్ట రమేశ్, రాజేశ్, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
‘పెద్దింటి’కి కథా పురస్కారం
సిరిసిల్ల అర్బన్: జిల్లాకు చెందిన సినీ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌కు ఎస్‌జీ ఫౌండేషన్ కథా పురస్కారం లభించినట్లు ఫౌండేషన్ చైర్మన్ పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో నగదుతోపాటు అవార్డు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సాహిత్యరంగంలో విశిష్ట కృషి చేసిన అశోక్‌కుమార్ ఇప్పటి వరకు 300 కథలు, 7 నవలలు, 5 నాటికలు రచించారు. 12 కథా సంకలనాలను ప్రచురించారు. అలాగే పది సినిమాలకు రచన అందించారు. కథా సాహిత్యంలో చేసిన కృషికి గుర్తింపుగా పెద్దింటికి ఈ పురస్కారం లభించడం విశేషం.
సిరిసిల్ల: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్ సోమవారం తెలిపారు. జిల్లాలోని యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని పలు ప్రైవేటు కంపెనీలు ఈ జాబ్‌మేళాకు వస్తాయని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఈ–మెయిల్ ద్వారా పొంది హాజరుకావాలని కోరారు.
నేడు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
వేములవాడ: వేములవాడ మున్సిపల్‌లో నలుగురు కో–ఆప్షన్ సభ్యులను మంగళవారం ఎన్నుకోనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. సభ్యుల ఎన్నిక కోసం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. సభ్యులంతా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే తుది నిర్ణయం తమదేనని విప్‌నకు చెప్పినట్లు తెలిసింది.


