● సిరిసిల్ల స్వరూపం మార్చారు ● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: మానేరు వాగులో సముద్రాన్ని తలపించేలా నీటిని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెచ్చారని, ఎట్లుండే సిరిసిల్ల ఎట్లా మారిందో మీ కళ్ల ముందే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు పేర్కొన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో సోమవారం స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ బొల్గం వైష్ణవి–నాగరాజుగౌడ్‌లు వందలాది మంది కార్యకర్తలతో బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిని కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ మాట్లాడుతూ తాలూక కేంద్రంగా ఉన్న సిరిసిల్లను జిల్లాను చేసి, కరీంగనర్‌లో ఉండే కలెక్టర్‌ను, ఎస్పీని సిరిసిల్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. మానేరువాగు ఎండిపోయి ఉండేదని, గోదావరి జలాల రాకతో రామప్పగుట్ట ఎక్కితే సముద్రాన్ని తలపిస్తుందని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెరిగి పుట్ల కొద్ది పంటలు పండుతున్నాయన్నారు. కేసీఆర్ పాలనలతో భూముల రేట్లు ఎలా ఉండేవని, ఇప్పుడెలా ఉన్నాయని ప్రశ్నించారు. మల్కపేట రిజర్వాయర్ ద్వారా చిన్నబోనాల, పెద్దబోనాలకు నీళ్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. చిన్నబోనాల పోచమ్మ గుడికి సాయం చేస్తానన్నారు. ఊరు అన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయని, వాటిని పరిష్కరిస్తూ పోవాలన్నారు. కౌన్సిలర్ వైష్ణవి, నాగరాజుగౌడ్‌లు పార్టీలో చేరిక సందర్భంగా బీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తామని, కేసీఆర్ సీఎం అయ్యేందుకు అంతఃకరణశుద్ధితో పని చేస్తామని ప్రతిజ్ఞ చేయడం ఆకట్టుకుంది. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం కళాచక్రపాణి, దార్ల సందీప్, మాజీ ఎంపీపీలు గజభీంకార్ రాజన్న, శ్రవణ్‌రావు, పార్టీ నాయకులు కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి, మంచె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిమ్ ప్రారంభం
సిరిసిల్ల కొత్తచెరువు కట్ట వద్ద కేటీఆర్ జిమ్‌ను ప్రారంభించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి పాల్గొన్నారు. అనంతరం సాయిమణికంఠ ఫంక్షన్‌హాల్ ఎర్రం శంకర్ కొడుకు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు.


