మూడు నెలలుగా వేతనాలు లేవు ఇబ్బందిపడుతున్న కార్మికులు, సిబ్బంది చేసిన పనులకు బిల్లులు వస్తలేవని సర్పంచుల ఆవేదన కుంటుపడుతున్న గ్రామాల అభివృద్ధి
సిరిసిల్లఅర్బన్/వేములవాడరూరల్: జిల్లాలోని గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ముఖ్యంగా ఆదాయ వనరులు అంతగా లేని చిన్న పంచాయతీల్లో కనీసం కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వచ్చే వర్షాకాలానికి సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన పనులకు నిధులు లేక కార్యదర్శులు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచులు సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేపట్టగా బిల్లులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సుమారు 1,244 మంది కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి మూడునెలలుగా వేతనాలు రావడం లేదని వాపోతున్నారు.
విడుదల కాని ఎస్‌ఎఫ్‌సీ నిధులు
ఈ ఏడాది జనవరిలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కొద్దిమేర గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ కాగా, అవి ప్రత్యేక అధికారుల పాలనలో అయిన ఖర్చులకే సరిపోవడం లేదని పలు వురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావల్సిన ఎస్‌ఎఫ్‌సీ నిధులు విడుదల కాక కార్మికులు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనులు చేసినా నిధులు రావాయే..
ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సర్పంచ్‌లు దృష్టి పెట్టారు. రెండేళ్లుగా గ్రామాల్లో ఉన్న పలు పెండింగ్ పనులకు పెట్టుబడి పెట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు, కరెంట్ బోర్లు తదితర పనులను సొంత ఖర్చులతో చేపట్టినా ఐదు నెలలుగా బిల్లులు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
కనిపించని సన్నద్ధత
ఈ ఏడాది వరుసగా ఎన్నికల హడావుడి కనిపిస్తుండడంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జిల్లాలోని పలు పంచాయతీల్లో అపరిశుభ్రత, అస్తవ్యస్థంగా మురుగు కాల్వలు, తాగునీటి వెతలు తదితర సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మరో నెల రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. నిధుల లేమితో అధికారులు ముందస్తు సన్నద్ధత కూడా చేయలేని పరిస్థితి నెలకొంది.
మాది గంభీరావుపేట మండలం పొన్నాలపల్లె గ్రామం. ఇక్కడ ఇద్దరం పనిచేస్తాం. నేను ఏడేళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నా. ఆరునెలలుగా జీతాలు రావ డం లేదు. అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాధానం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. పెండింగ్ జీతాలు అందజేయాలి.
– భగవంతం, పంచాయతీ కార్మికుడు,
పొన్నాలపల్లె
జిల్లాలో..
మండలాలు 12
గ్రామపంచాయతీలు 260
సిబ్బంది 1,244 (సుమారు)


