ఆ పల్లెలు..
● తోటల పెంపకంతో ఆర్థికంగా స్థిరత్వం ● సొంతంగా మార్కెట్‌లో విక్రయాలు ● ఆదర్శంగా నిలుస్తున్న పల్లె రైతులు
వేములవాడరూరల్: ఏటా సంప్రదాయ పంటలు సాగుచేస్తూ లాభాలు అంతంతే రావడంతో ఆ పల్లె రైతులు తమ తీరు మార్చుకున్నారు. పంటల మార్పిడి చేపట్టారు. కూరగాయలు సాగుచేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. తమకున్న భూమిలో పలు రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. అంతేకాకుండా వాటిని దళారులకు ముట్టజెప్పకుండా మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. ఇలా అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో ఎటూ చూసిన కూరగాయల తోటలే కనిపిస్తున్నాయి.
ఎటూ చూసిన తోటలే..
వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి, అయ్యోరుపల్లి, నాంపల్లి, శాలరామన్నపల్లి, హన్మక్కపల్లిల్లో కూరగాయల తోటలు సాగుచేస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వేములవాడరూరల్ మండలం నాగాయపల్లి, పోచెట్టిపల్లి, మర్రిపల్లి, ఎదురుగట్ల, మల్లారం, హన్మాజిపేట, లింగంపల్లి, చెక్కపల్లితోపాటు బోయినపల్లి మండలంలోని కొదురుపాక, నీలోజిపల్లి, రత్నంపేట గ్రామాల రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు.


