సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రోత్పత్తి రంగంలోని వార్పిన్ కార్మికుల కూలి పెంచాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. సిరిసిల్లలోని చేనేత, జౌళిశాఖ ఆఫీస్ వద్ద శనివారం కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. వార్పిన్ కార్మికుల కూలి పెంపు కోసం ఈనెల 4న కలెక్టర్ ఆఫీసు వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, మచ్చ వేణు, ప్రవీణ్, నర్సయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
లారీల కోసం రైతుల రాస్తారోకో
కోనరావుపేట(వేములవాడ): కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ క్రాసింగ్ వద్ద బైఠాయించారు. లారీలు వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. రైతులు మాట్లాడుతూ నిజామాబాద్‌లోని ఐకేపీ కేంద్రంలో 4వేల బస్తాలు తూకం వేసి పెట్టారన్నారు. అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని తరలించాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి లారీలు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్‌లోనూ కష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి, ఎంఈవో కృష్ణహరి సూచించారు. మండలంలోని నారాయణపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సూర స్నేహలత 572, కాసారపు శ్రీకర్ 569, దీప్తి 567 మార్కులు సాధించి మండల స్థాయిలో ఉత్తమంగా నిలిచారు. వీరిని డీఈవో, ఎంఈవోలు అభినందించారు. హెచ్‌ఎం చంద్రశేఖర్‌ర్ తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతి టాపర్లకు ఎస్పీ సన్మానం
తంగళ్లపల్లి: పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన శ్రీసరస్వతి, ప్రగతి విద్యాలయ విద్యార్థులు ఎల్.ప్రదీప్(577), ఈ.సంజన(570)లను ఎస్పీ మహేశ్ బీ గీతే అభినందించారు. కరస్పాండెంట్ ఎం.శ్రీనివాస్‌యాదవ్, మనోహ ర్, సాయిప్రియ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీలను విస్మరించిన బీఆర్‌ఎస్
సిరిసిల్లటౌన్: గతంలో పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఏఐసీసీ మైనార్టీ శాఖ పరిశీలకులు మహ్మద్ ఫయాజ్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మైనార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. మొదటి నుంచి మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. అహ్మద్‌ఖాన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.


