సిరిసిల్ల: కార్మిక క్షేత్రం కన్నీటి సంద్రమైంది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు.. బాధ్యతగా కుటుంబాలను పోషించే ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సిరిసిల్లలో కన్నీరు ఉబికింది. అయ్యో దేవుడా.. ఏమిటీ దారుణం అంటూ గుండెలు బాదుకుంటూ కుటుంబ సభ్యులు రోదించారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డులో పెద్ద గోల్కొండ–తొండుపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల సర్ధార్‌నగర్‌కు చెందిన రెండు కుటుంబాల్లోని ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఉ స్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగించుకుని ఆరు మృతదేశాలు శనివారం సిరిసిల్లకు తీసుకొ చ్చారు. రెండు కుటుంబాలకు చెందిన ఆరు శవాలు రావడంతో సర్ధార్‌నగర్ శోకసంద్రంలో మునిగింది.
అతివేగంతో నిండు ప్రాణాలు బలి
సిరిసిల్లకు చెందిన బొల్లి రాజు బీడీ కంపెనీ టేకేదార్. అతనికి ముగ్గురు పిల్లలు. శివకుమార్, స్వేత, శిరీష్. పెద్దకొడుకు, కోడలు శివకుమార్, లాస్య దంపతులు, వాళ్ల పాప రిషిత హైదరాబాద్ సనత్‌నగర్‌లో నివాసం ఉంటారు. చెల్లెలు స్వేత, కోడం శ్రీనివాస్, అల్లుళ్లు కృష్ణచంద్ర, మాధవ్‌లు గురువారం సనత్‌నగర్‌లోని ఇంటికి వెళ్లారు. వీరంతా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాలను సందర్శించుకుని చిలుకూరి బాలాజీ ఆలయ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వ్యాగనార్ కారు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. స్వేత ఒక్కరే మాత్రం చావుబతుకుల్లో ఆస్పత్రిపాలైంది. ఆ కారుపై అప్పటికే అతివేగంగా వెళ్లినట్లు రెండు ఈ–చలానాలు ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి.
ఆరు శవాలు.. ఐదు రథాలు.. రెండు కాష్టాలు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని నాలుగు వైకుంఠ రథాలతోపాటు, కోనరావుపేటకు చెందిన మరో వైకుంఠరథాన్ని తెప్పించి, ఆరు శవాలను ఐదు రథాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మానేరువాగులో ఒక్క కాష్టంపై బొల్లి శివకుమార్, అతని భార్య లాస్య, కూతురు రిషిత మృతదేహాలను ఉంచి శివకుమార్ తండ్రి బొల్లి రాజు చితికి నిప్పు అంటించా రు. మరో కాష్టంపై కోడం శ్రీనివాస్, అతని ఇద్దరు కొడుకులు కృష్ణచంద్ర, మాధవ్ మృతదేహాలను ఉంచారు. శ్రీనివాస్ తల్లి కోడం మల్లవ్వ గుండెల నిండా దుఃఖంతో ఒక్కగానొక్క కొడుకు చితికి నిప్పటించారు. బాధిత కుటుంబ సభ్యులను, బీఆర్‌ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ కుటుంబాన్ని హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించగా.. సిరిసిల్లలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, ట్రాక్టర్ యజమానులు, బీడీ కంపెనీ టేకేదార్లు సందర్శించి నివాళి అర్పించారు.
సిరిసిల్ల చరిత్రలో మూడో పెద్ద ఘటన
సిరిసిల్ల పట్టణ చరిత్రలో మూడో పెద్ద ఘటన ఇది. ఆరు శవాలను ఒకేసారి ఊరేగించడం, అదీ ఐదు వైకుంఠ రథాలపై తీసుకెళ్లడం చూపరులను కలచివేసింది. మూడున్నర దశాబ్దాల కిందట కొండ నారాయణ కుటుంబం దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం. సిరిసిల్లకు చెందిన ప్రముఖ డాక్టర్ పూర్ణచందర్ కుటుంబం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ రెండు ఘటనల తరువాత శుక్రవారం నాటి ఔటర్ రింగురోడ్డు ప్రమాదమే పెద్దది.
ప్రేమ పెళ్లి.. ప్రమాదంలో బలి
బొల్లి శివకుమార్ కులాంతర వివాహం చేసుకున్నారు. కామారెడ్డికి చెందిన రెనికిండి రాజేశ్వరి అలియాస్ లాస్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి రిషిత అనే కూతురు ఉంది. లాస్య కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే లాస్య, బీడీ కంపెనీని నిర్వహించే శివకుమార్, వారి కూతురు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించగా.. వారిని ఒకే చితిపై దహనం చేయడం కలచివేసింది. కోడం శ్రీనివాస్, అతని ఇద్దరు కొడుకులతో సహా ఒకే చితిపై దహనం చేశారు.


