పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

● డీవైఎస్‌వో అజ్మీరా రాందాస్‌ ● ఎన్పీడీసీఎల్‌ సిరిసిల్ల సర్కిల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌

● డీవైఎస్‌వో అజ్మీరా రాందాస్‌

సిరిసిల్ల: భారత ప్రభుత్వం 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ఇచ్చేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్‌ శనివారం తెలిపారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ వివిధ రంగాలలో నిష్ణాతులైన యువతీ యువకులకు పద్మ అవార్డులను ఇచ్చేందుకు దరఖాస్తులను కోరుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని, ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆఫీస్‌ను సంప్రదించాలని కోరారు.

విద్యుత్‌ అంతరాయ నివారణకు ప్రత్యామ్నాయ లైన్లు

సిరిసిల్ల: జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలకు ఏర్పడే విద్యుత్‌ అంతరాయాలను నివారణకు ప్రత్యామ్నాయంగా 33 కేవీ ఇంటర్‌లింక్‌ విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌ శనివారం తెలిపారు. జిల్లా పరిధిలో నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. విద్యుత్‌ లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి 13 కొత్త సబ్‌స్టేషన్లు మంజూరైనట్లు వివరించారు. స్థిరమైన విద్యుత్‌ సరఫరా కోసం 19 బంచ్డ్‌ బ్రేకర్ల విభజన పనులు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష్మీపూర్‌ సబ్‌స్టేషన్‌లో ఒక బ్రేకర్‌ చార్జ్‌ చేశామని, ఇల్లంతకుంట మండలం గాలిపల్లి సబ్‌స్టేషన్‌లో 11 కేవీ నర్సక్కపేట ఫీడర్‌ చార్జ్‌ చేసినట్లు వివరించారు. రైతులకు 902 నూతన వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు విడుదల చేసినట్లు తెలిపారు. లోడ్‌ డిమాండ్‌కు అనుగుణంగా 55 కొత్త అదనపు డీటీఆర్‌లు(ట్రాన్స్‌ఫార్మర్లు) ఒక కెపాసిటర్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్‌ అంతరాయాలను అరికట్టడానికి భారీ ఎత్తున మరమ్మతు పనులు చేస్తున్నామని, 20 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్ల నిర్వహణ పనులు పూర్తి చేసి 105 మధ్య స్థంబాలను ఏర్పాటు చేసి, 54 దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ చేశామని వేణుమాధవ్‌ వివరించారు. అంతరాయాన్ని వెంటనే గుర్తించేందుకు ‘ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లు’ లైన్‌లలో అమర్చమన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఊరటనిస్తూ 166 పవర్‌లూమ్‌ సర్వీసులను కేటగిరీ–3 నుంచి కేటగిరీ–4 మార్చినట్లు తెలిపారు. నెల రోజుల్లో జిల్లాలో విప్లవాత్మక మార్పులకు ఎన్‌పీడీసీఎల్‌ శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement