● పంచాయతీ కార్యాలయంలో ఆందోళన
ముస్తాబాద్: ముస్తాబాద్ మేజర్ పంచాయతీ కార్యాలయంలో తొమ్మిదో వార్డు సభ్యురాలు బండి సుమలత ఖాళీ బిందెలతో శుక్రవారం ధర్నా చేపట్టారు. స్వయంగా వార్డు సభ్యురాలే నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వార్డు సభ్యురాలు మాట్లాడుతూ.. తన వార్డులో నెల రోజుల క్రితం బోరు మోటారు కాలిపోయిందన్నారు. దానిని మరమ్మతు చేసేందుకు పంచాయతీ సిబ్బంది ఇప్పటివరకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా వార్డు ప్రజలకు నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, కొంతమంది దానిని అడ్డుకున్నారన్నారు. బోరు మోటారు బాగు చేయక, ట్యాంకర్‌ను పంపించక వార్డు ప్రజలపై ఎవరు కక్ష కట్టారో తేలాలని పట్టుబట్టారు. స్టోర్‌రూమ్‌లో అదనంగా మోటారు ఉన్నా.. దానిని పంపించలేదని అన్నారు. కార్యదర్శి రమేశ్ స్పందిస్తూ.. త్వరలోనే మోటారును పంపిస్తామని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.


