కొనుగోళ్లలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో వేగం పెంచాలి

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ● ఎస్పీ మహేశ్‌ బిగితే ‘ఇందిరమ్మ’ను త్వరితగతిన పూర్తి చేయాలి ● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ● వేములవాడకు సంపత్‌.. మంచిర్యాలకు అన్వేశ్‌ ● రాజకీయ జోక్యంతో మారిన స్వరూపం

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు వేగం పెంచాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ అన్నారు. రాచర్లతిమ్మాపూర్‌లోని శ్రీసాయి ఇండస్ట్రీస్‌ మిల్లును శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం దిగుమతి, ఇతర అంశాలపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే దించుకొని లారీలు పంపాలని సూచించారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. తహసీల్దార్లు మారుతిరెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌

సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పోలీస్‌ యాక్ట్‌ 1861 ప్రకారం మే 1 నుంచి 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ మహేశ్‌ బిగితే వెల్లడించారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని స్పష్టం చేశారు. డీజే సౌండ్‌ సిస్టమ్‌ వినియోగం కూడా నిషేధితమని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టొద్దని హెచ్చరించారు. జిల్లా ప్రజలు పోలీస్‌ శాఖకు పూర్తి సహకారమందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.

ఇల్లంతకుంట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పొత్తూరు గ్రామంలో మంచే లక్ష్మి, చిక్కుడువానిపల్లెలో కంకటి రేవతి–రమేశ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి శుక్రవారం గృహప్రవేశం చేయగా.. ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేదవారికి సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్పంచులు పట్నం అశ్విని, చింతమడక కళ్యాణ్‌, చొప్పరి భూమయ్య, మామిడి రాజు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్‌ పాశం రాజేందర్‌రెడ్డి, పసుల వెంకటి, ఉప సర్పంచ్‌ చిక్కుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఎక్కడి కమిషనర్లు అక్కడే..?

వేములవాడ: వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా మంచిర్యాల కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అన్వేశ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్‌ను హైదరాబాద్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమేరకు శుక్రవారం వీరు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ రాజకీయ జోక్యంతో మంచిర్యాల కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న అన్వేశ్‌ను అక్కడే ఉండేలా అక్కడి ప్రధాన నాయకుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే అన్వేశ్‌ మొన్నటివరకు వేములవాడ కమిషనర్‌గా సేవలందించడంతో ఆయన సేవలను ఇక్కడ వినియోగించుకునేందుకు ఇక్కడి నాయకత్వం సైతం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అక్కడి నాయకుడు ఇక్కడి నాయకుడితో మాట్లాడి వీరి సేవలను ఎక్కడికక్కడే వినియోగించుకునేందుకు ఫైనల్‌ చేసినట్లు సమాచారం. దీంతో అన్వేశ్‌ మంచిర్యాలకు, సంపత్‌కుమార్‌ వేములవాడకు పరిమితం కానున్నారు. ప్రభుత్వం మరో ఆర్డర్‌ వెలువరించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement