మెడికల్ కాలేజీలో
ఇది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవుట్ పేషెంట్(ఓపీ) విభాగం. ఇక్కడ నిత్యం సగటున వెయ్యి నుంచి 1,400 మంది రోగులు ఓపీ చిట్టీలు తీసుకొని వివిధ రకాల వైద్య నిపుణుల వద్దకెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. సిరిసిల్ల నడి బొడ్డున అంబేడ్కర్ సర్కిల్‌లోని ఈ ఆస్పత్రిలో 330 పడకలుండగా.. నిత్యం 200 నుంచి 300 మంది రోగులు అడ్మిట్ అవుతుంటారు. 50 పడకల ఆస్పత్రిగా ఉన్న ఆ సర్కారు దవాఖానను 330 పడకలకు పెంచుతూ పోవడం, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చడంతో రోగుల సంఖ్య పెరిగి ఇలా రద్దీగా మారింది. ఉదయం 10 గంటలకు ఆస్పత్రికెళ్తే.. కాలు పెట్ట సందు లేకుండా రోగులు, వారి బంధువులు, వాహనాల రద్దీతో జిల్లా జనరల్ ఆస్పత్రి కిటకిటలాడుతుంది.
ఇది పట్టణ శివారులోని పెద్దూరు బైపాస్ రోడ్డు పక్కన నిర్మించిన మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి భవనాన్ని సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(సివిల్ సర్జన్) సుమన్‌మోహన్‌రావు, మెడికల్ కాలేజీ డాక్టర్ల బృందం క్షేత్రస్థాయిలో ఇటీవల పరిశీలించారు. ఇక్కడ ఉన్న వసతులు, ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వానికి ఈ బృందం నివేదిక పంపించింది. ఈ ఆస్పత్రిలో 50 పడకల వసతులతో కూడిన భవనం సిద్ధమైంది. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇరుకిరుకుగా కొనసాగుతున్న క్రిటికల్ కేర్ యూనిట్ ఐసీయూ, అత్యవసర చికిత్స కేంద్రం(ఎమర్జెన్సీ సెంటర్) వంటి వాటిని మెడికల్ కాలేజీ పరిధిలోని క్రిటికల్ కేర్ యూనిట్‌కు మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మెడికల్ కాలేజీలో వసతులను కల్పిస్తున్నారు.


