● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● మండేపల్లి ఏటీసీలో ఘనంగా మేడే వేడుకలు ● హాజరైన కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): అన్ని రంగాల కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం మేడే సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి గితేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ ఫోన్ ద్వారా కార్మికులకు తన శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ సమాన గౌరవం
గాంధీజీ ఆశయాల ప్రకారం ప్రతీ కార్మికుడికి సమాన గౌరవం దక్కాలని కలెక్టర్ అన్నారు. భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో పేర్లు నమోదు చేసుకొని పథకాలను పొందాలని సూచించారు.
అండగా పోలీస్ శాఖ
వివిధ పరిశ్రమల్లో, రోజూవారీ కూలీలుగా పని చేస్తున్న కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ అన్నారు. డీఎస్పీ నాగేంద్రాచారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, పరిశ్రమల అధికారి హనుమంతు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
బాలల భద్రత..
వేములవాడఅర్బన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా బాల భరోసాపై వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అర్హులందరికీ ‘ఇందిరమ్మ’
వేములవాడ: అర్హులైన పేదలకు సొంతిల్లు అప్పగించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో పూర్తయిన పలు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.


