● మేడే వేడుకల్లో నాయకులు
సిరిసిల్లటౌన్: పెత్తందార్ల పెట్టుబడి వ్యవస్థపై పోరాడితేనే కార్మికుల హక్కులు సాధిస్తామని వక్తలు స్పష్టం చేశారు. శుక్రవారం మేడే వేడుకలు కార్మిక క్షేత్రం సిరిసిల్లలో ఘనంగా జరిగాయి. అన్ని ప్రధాన ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. సిరిసిల్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్టీసీ కార్మిక నాయకులు చింతకింది బాణయ్య, చొప్పదండి ప్రకాశ్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగల శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు. ఉత్తమ కార్మికులను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్‌పాషా, స్థానిక కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక బీవైనగర్ సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రమేశ్ జెండా ఆవిష్కరించారు. జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల కార్మిక భవనం సీపీఐ కార్యాలయంపై జిల్లా కార్యదర్శి సుదర్శన్ జెండా ఎగరేశారు. స్థానిక పెద్దబజారులో హిందు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. సిరిసిల్ల డైయింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిపారు. ఏఐఎఫ్‌టీయూ న్యూ ఆధ్వర్యంలో జాతీయ నాయకుడు ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ధశరథం జెండా ఎగరేశారు.


