● ఈనెల 4న వేములవాడ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక?
వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. గతనెల 22న నామినేషన్ ప్రక్రియ ముగియగా, స్క్రూటినీలో మొత్తం 22 నామినేషన్లకు 8 తిరస్కరణకు గురవడం చర్చనీయాంశమైంది. 14 మంది పోటీలో ఉండగా, తుది ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 4 వరకు నలుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నికోవాల్సి ఉంటుంది.
విప్ చేతుల్లో తుది నిర్ణయం
కో ఆప్షన్ ఎంపికలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాత్ర కీలకంగా మారింది. అధికార పార్టీ ఆధిపత్యం ఉన్న కౌన్సిల్ కావడంతో, ఆయన సూచనల మేరకే తుది ఎంపిక జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార పాలకవర్గాలు చెబుతున్నాయి. అందుకే అభ్యర్థులు విప్ మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
4న ఎన్నిక?
ఈనెల 4న కోఆప్షన్ ఎన్నిక నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ ఎన్నిక జరగనుంది. దీంతో అప్పటివరకు రాజకీయ లాబీయింగ్ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.
టెన్షన్..టెన్షన్
మొత్తం నాలుగు స్థానాల్లో 2 మైనార్టీ, 2 స్పెషల్ నాలెడ్జ్ పర్సన్స్‌కు కేటాయింపు ఉన్న నేపథ్యంలో వర్గాల మధ్య సమతుల్యత సాధించడం అధికార పార్టీకి సవాల్‌గా మారింది. ఒకవైపు అర్హతలు, మరోవైపు రాజకీయ నిబద్ధతం రెండు అంశాలను బేరీజు వేసుకుంటూ తుది జాబితా ఖరారు చేసే ప్ర క్రియ సాగుతోంది. దీంతో విప్ నిర్ణయం మేరకు అ భ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరి పేర్లు బయటికి రాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.
‘ఆది’ చుట్టూ ఆశావహులు
మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ గడువు పూర్తికావడంతో ఇక ఎన్నిక ఒక్కటే మిగిలింది. ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు ఆశావహులు విప్ ఆది శ్రీనివాస్ మన్ననల కోసం ఆయన వద్దకు చేరుకుంటున్నారు. తమకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. శీనన్న ఎవరికి అవకాశం కల్పిస్తారోనని పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.


