● కలెక్టర్ గరీమా అగ్రవాల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్లు, గన్నీ సంచులు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే ముందే ప్యాడీ క్లీనర్లను ఉపయోగించి నాణ్యతను పెంచుకోవాలని పేర్కొన్నారు. కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యం పంపాలని, సేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ విజయ్‌ప్రకాశ్‌రావు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.


