
ఏడాది అనంతరం మిడ్‌మానేరుకు ఎల్లంపల్లి నీరు
బోయినపల్లి(చొప్పదండి): ఏడాది అనంతరం శ్రీపాద ఎల్లంపల్లి నీరు ఎత్తిపోతల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి తరలుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్‌ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు గోదావరి జలాలు తరలిస్తున్నారు. గురువారం ప్రాజెక్టులో 8.084 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.
గతేడాది జూలైలో 14టీఎంసీల ఎత్తిపోతలు
గతేడాది వర్షాకాలం ఆరంభంలో సరైన వర్షాలు కురువక మిడ్‌మానేరులో నీటి నిల్వలు అడుగంటాయి. 2024 జూలై 28నుంచి ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు నుంచి వయా నందిమేడారం, లక్ష్మీపూర్‌ల నుంచి ఎత్తిపోతల ద్వారా వరద కాలువకు నీరు ఎత్తి పోశారు. సుమారు 14 టీఎంసీల మేర నీటిని వరదకాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టుకు తరలించారు.
ఫలించిన రైతన్నల ఆశలు
ఆశించిన మేర వర్షాలు కరవకపోవడంతో ఎల్లంపల్లి నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంత్రి ఉత్తమమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎల్లంపల్లి జలాలు వరదకాలువ మీదుగా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి చేరుతుండడంతో ఈప్రాంత రైతులు హర్శం వ్యక్తం చేస్తున్నారు.