‘ప్రైవేట్’లో పేదలకు ఉచితం అందేనా !
● 25 శాతం ఉచిత సీట్లపై తల్లిదండ్రుల ఎదురుచూపులు ● ఫీజులు చెల్లించలేక అవస్థలు ● విద్యాహక్కు చట్టం అమలుపై సందిగ్ధం
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు, దివ్యాంగులకు కేటాయించాలన్న చట్టం అమలుపై సందిగ్ధం నెలకొంది. ఫలితంగా ఏళ్లుగా పేదలు కార్పొరేట్ విద్యకు దూరమవుతున్నారు. విద్యాహక్కు చట్టం–2009 ప్రకా రం ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లు నిరుపేద, దివ్యాంగ విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యనందించాల్సి ఉంది. కానీ ఏళ్లుగా ఈ చట్టం అమలు కా వడం లేదు. తాజాగా ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో పేద విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. ఈ ఏడాది నుంచైనా విద్యాహక్కుచట్టం అమలవుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 120 ప్రైవేటు పాఠశాలలు ఉన్నా యి. ఆయా పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చట్టం అమలైతే వారిలో 25 శాతం మందికి ప్రయోజనం కలుగనుంది.
16 ఏళ్లుగా నిరీక్షణే..
2009లో విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25శాతం మంది పేద విద్యార్థులను చదివించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఈ చట్టాన్ని కార్యాచరణలో చూపించాల్సి ఉంది. జీవో 44ను అమలు చేయాల్సి ఉన్నా.. 15 ఏళ్లుగా అమలు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు జీవోనుగాని, చట్టాన్నిగాని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.
చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. అప్పుడే పేద పిల్లలపై ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చట్టం ప్రకారం 25శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి.
– కల్యాణ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
అమలుపై దృష్టి పెట్టాలి
విద్యాహక్కు చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. అనేక మంది పేద పిల్లలకు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యాహక్కు చట్టాన్ని, జీవో 44ను పకడ్బందీగా అమలు చేసి పేద పిల్లలకు న్యాయం చేయాలి.
– తిరుపతి, ఏబీవీపీ నాయకుడు
‘ప్రైవేట్’లో పేదలకు ఉచితం అందేనా !
‘ప్రైవేట్’లో పేదలకు ఉచితం అందేనా !


