కార్డులొచ్చాయ్.. కోటా రాలే !
● కొత్త కార్డుదారులకు అందని బియ్యం
● 15వ తేదీ దాటుతున్నా పల్లెలకు రాని రేషన్ ● తెరుచుకోని రేషన్ దుకాణాలు
● ఆందోళనలో నిరుపేదలు ● సన్నబియ్యం కోసం ఎదురుచూపులు
సిరిసిల్ల: ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డులు వచ్చినా సంబురం లేదు. ఈ కార్డులకు బియ్యం కోటా రాకపోవడంతో కొత్త లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉండి.. ఆయా కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రం బియ్యం కోటా మంజూరైంది. మూడేళ్లు దాటిన పిల్లలకూ ఆరు కిలోల చొప్పున బియ్యం మంజూరైంది. రేషన్ కార్డు ఉండీ.. మార్పులు, చేర్పులు చేసుకున్న వారికి బియ్యం కోటా మంజూరుకాగా.. కొత్త రేషన్‌కార్డులకు కోటా పెరగలేదు. అయితే ఇదే సమయంలో జిల్లాలో చాలా పల్లెల్లో ఈనెల రేషన్‌బియ్యం పంపిణీ చేయలేదు.
స్మార్ట్ కార్డుల జారీ
గతంలో రేషన్ కార్డులు ఉండగా.. వాటి స్థానంలో ఆహార భద్రత కార్డులుగా ప్రభుత్వం పేరు మార్చింది. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులు గా జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నే పథ్యంలో డిజిటల్ స్మార్ట్ కార్డులు రానున్నాయి. ప్ర స్తుతం ఆన్‌లైన్‌లో ఆహార భద్రత కార్డులను జిరాక్స్‌లు చేయించుకుని బియ్యం పొందుతున్నారు.
పని ఒత్తిడిలో యంత్రాంగం
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వేలు ఏకకాలంలో నిర్వహించాల్సి రావడంతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. మూడు పథకాలు ముఖ్యమైనవి కావడంతో సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిళ్లలో పనిచేయలేక పోతున్నానని విధులను వదిలేసి వెళ్లారు. క్షేత్రస్థాయి సర్వేల్లో సమస్యలు ఎదురవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
సర్వే జాప్యం
జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా నేరుగా వచ్చిన దరఖాస్తులు ఆయా మండలాల తహసీల్దార్ల లాగిన్‌కు వెళ్లాయి. ఆ దరఖాస్తుదారులు అర్హులా.. అనర్హులా అని తేల్చే సర్వేల్లో జాప్యమవుతుంది. ఫలితంగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. 2025 జనవరి నాటికి 9,731 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వగా.. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 22,114 మంది దరఖాస్తు చేశారు. దీనిలో ఎన్ని దరఖాస్తులు సర్వే పూర్తయింది.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో ఆన్‌లైన్‌లో చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,922 ఉన్నట్లు డీఎస్‌వో లాగిన్‌లో చూపిస్తుంది. కానీ సర్వే స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్పులు, చేర్పులకు సంబంధించి మరో 20,606 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కార్డులొచ్చాయ్.. కోటా రాలే !


