మారనున్న కన్నారం! | Sakshi
Sakshi News home page

మారనున్న కన్నారం!

Published Wed, May 22 2024 4:15 AM

మారను

● ఉమ్మడి జిల్లాలో ఒకదానికి పీవీ పేరు ● ఇటీవల కేబినెట్‌లో ప్రస్తావన.. ● కోడ్‌ తర్వాత హుస్నాబాద్‌ విలీన ప్రక్రియ మొదలు ● సిరిసిల్ల జిల్లా మనుగడపై త్వరలో స్పష్టత

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ముద్దుబిడ్డ.. మంథని నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, హన్మకొండ నుంచి ఎంపీగా, దేశ ప్రధానిగా ఎదిగిన మహనీయుడు. పతనా వస్థలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థకు సంస్కరణలతో ఊపిరి లూదిన దార్శనికుడు. దేశ పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించి, లక్షలాది మందికి ఉపాధి కల్పించిన విజనరీ. భూసంస్కరణలతో నిరుపేదల కు భూమి దక్కేలా చేసిన ఉదారవాది. ఆయనే పీవీ.. మన ఠీవీ. ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసి గౌరవించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులేస్తోంది. ఆయన పేరును నిత్యం తలచుకునే ఏర్పా ట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఒక జిల్లాకు పీవీ నరసింహారావు పేరుపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది.

కేబినెట్‌లోనూ పీవీపై చర్చ

1952లో మంథని ఎమ్మెల్యేగా తొలిసారి పీవీ నరసింహారావు విజయం సాధించారు. అది మొదలు వెనుదిరిగి చూడలేదు. మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ఆ పదవులకే వన్నె తెచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు జిల్లాలకు పేర్లు మారుస్తామని ప్రకటించింది. అందుకోసం సర్దార్‌ సర్వా యి పాపన్న, పీవీ నరసింహారావు పేర్లను పరిశీలించినట్లు తెలిపింది. ఈక్రమంలో ఉమ్మడి కరీంనగర్‌లో ఓ జిల్లాకు పీవీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇటీవల జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. పీవీ నరసింహారావు పుట్టింది ఉమ్మడి వరంగల్‌. దత్తత కారణంగా చిన్నతనంలో ఉమ్మడి కరీంనగర్‌లోని వంగరకు రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పీవీ పేరును ఉమ్మడి కరీంనగర్‌ లేదా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఒక జిల్లాకు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్‌ను జిల్లాగా చేసి దానికి పీవీ నరసింహారావు పేరును పెట్టాలని చాలా కాలంగా ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్న విషయాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది.

రాజన్న సిరిసిల్ల మనుగడ?

జిల్లాల విభజనలో శాసీ్త్రయత లోపించినందునే తాము ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అందుకే, కొన్ని జిల్లాలను రద్దు చేయాలని ఆలోచనలో ఉందనే ప్రచారం సాగుతోంది. ఆ జాబితాలో రాజన్నసిరిసిల్ల జిల్లా కూడా ఉండడం గమనార్హం. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్‌ కూడా ఇదే అంశాన్ని పలు వేదికలపై లేవనెత్తారు. జిల్లాల పునర్‌ విభజన కోసం ప్రభుత్వం త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయనుందని సమాచారం. ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా జిల్లాల రద్దుపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. దీంతో త్వరలోనే సిరిసిల్ల జిల్లాగా కొనసాగుతుందా? లేదా కరీంనగర్‌లో విలీనమవుతుందా? అన్న విషయంపై స్పష్టత రానుంది. అలా స్పష్టత వస్తే.. 2016 తర్వాత పాత కరీంనగర్‌ రూపురేఖలు, నామకరణాలు మరోసారి మారనున్నాయి.

హుస్నాబాద్‌ తిరిగి విలీనం

13 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉమ్మడి జిల్లా విశాలంగా ఉండేది. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కరీంనగర్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా, కొన్ని మండలాలను కలిపి మరో మూడు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. అంటే కరీంనగర్‌ జిల్లా ఏడు భాగాలుగా విడిపోయింది. జిల్లాల ఏర్పాటును కొందరు స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకించారు. హుస్నాబాద్‌ మండలంలోనూ కొందరిలో ఈ అసంతృప్తి ఉంది. జిల్లాల విభజనతో తమకు కరీంనగర్‌తో ఉన్న అనుబంధం తెగిపోయిందని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమ నియోజకవర్గం మూడు వేర్వేరు జిల్లాల్లో ఉండడంతో సర్టిఫికెట్లు, ధ్రువీకరణపత్రాలు, స్థానికత తదితర సాంకేతిక ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్‌ మండలాన్ని కరీంనగర్‌లో విలీనం చేస్తానని పొన్నం ప్రభాకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పొన్నం విజయం సాధించడం, మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. అనంతరం విలీన ప్రస్తావన వచ్చినా.. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ రావడంతో వాయిదా పడింది. కోడ్‌ పూర్తయిన తర్వాత మండల విలీన ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.

మారనున్న కన్నారం!
1/4

మారనున్న కన్నారం!

మారనున్న కన్నారం!
2/4

మారనున్న కన్నారం!

మారనున్న కన్నారం!
3/4

మారనున్న కన్నారం!

మారనున్న కన్నారం!
4/4

మారనున్న కన్నారం!

Advertisement
 
Advertisement
 
Advertisement