గిద్దలూరు రూరల్: ప్రజాస్వామ్యపద్ధతిలో నిర్వహించాల్సిన ఎన్నికలను కూటమి ప్రభుత్వ అరాచకపాలనలో అడ్డగోలుగా నిర్వహిస్తున్నారని, దుష్టశక్తులతో తాము పోరాడలేక ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నామని గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి ప్రకటించారు. గిద్దలూరు పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం ఎదుట శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నాయకులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ నాయకులకు ప్రజాస్వామ్య పద్ధతులు తెలియకపోవడం చాలా బాధాకరమన్నారు. ఎంపీటీసీగా నామినేషన్లు వేయడానికి వెళ్తున్న వారిపై దౌర్జన్యం చేసి దాడులకు పాల్పడి వారి చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కుని చించిపడేయడం దారుణమని అన్నారు. పోలీసులు, టీడీపీ నాయకులు కుమ్మక్కయి నామినేషన్ కేంద్రాల వద్ద వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటే.. టీడీపీ నాయకులు గుంపులుగా ఉండటమేంటని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులు మాత్రం కేవలం నలుగురు మాత్రమే వెళ్లాలంటూ.. టీడీపీకి చెందిన వారు మాత్రం గుంపులుగా వెళ్లడానికి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. బయటి నుంచి గూండాలను తెప్పించి మరీ నామినేషన్ కేంద్రాల వద్ద ఉంచి దాడులకు పాల్పడ్డారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందిగానీ.. అడ్డగోలుగా వ్యవహరించే అరాచకశక్తులతో పోరాడేందుకు తమ పార్టీ నాయకులు సిద్ధంగా లేరన్నారు. గత మూడు రోజులుగా నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కేవలం టీడీపీ నాయకులు మాత్రమే నామినేషన్లు వేసి ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తున్నారన్నారు. ఏకగ్రీవం అంటే పోటీలో నిలబడే నాయకులు స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటే జరిగే ప్రక్రియ అని, అంతేగానీ.. ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వంశీధరరెడ్డి ఖండించారు. టీడీపీ వారి విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం పోలీసులకు పరిపాటిగా మారిందన్నారు. టీడీపీ గూండాల చర్యలకు నిరసనగా ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలబడకుండా తప్పుడు ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికలకు దూరంగా ఉండదలచినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఓబులరావుయాదవ్, మురళి, శ్రీరంగం, పాండురంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీటీసీ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నాం
గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి


