ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జిల్లా ఎన్నికల పరిశీలకులకు క్షేత్రస్థాయిలో పనిచేసే మైక్రో అబ్జర్వర్లే కళ్లు, చెవులు వంటి వారని జిల్లా ఎన్నికల పరిశీలకులు కె. హెప్సిబా రాణి అన్నారు. ప్రకాశం భవనంలో మైక్రో అబ్జర్వర్లకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పి.రాజా బాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెప్సిబా రాణి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, బీఎల్‌వో హెల్ప్ డెస్క్, ఇతర సౌకర్యాలను సూక్ష్మస్థాయిలో పరిశీలించడంలో మైక్రో అబ్జర్వర్లదే కీలకపాత్ర అన్నారు. ఎన్నికల మాన్యువల్ ప్రకారం ఈ దిశగా విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ అవసరమైన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. మైక్రో అబ్జర్వర్లు కూడా పూర్తిస్థాయి అవగాహనతో విధులకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శిక్షణతో పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, చెక్ లిస్ట్ ద్వారా విధులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. బ్యాలెట్ బాక్స్‌లను నిర్వహించే విధానంపైనా ప్రత్యక్ష అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సమావేశంలో అర్బన్ ఎలక్షన్ నోడల్ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎల్.డీ.ఎం.రమేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రాజా మ్యాత్యూ పాల్గొన్నారు.


