ఒంగోలు సబర్బన్: నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌తో పాటు ఆ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు నగరంలోని అన్ని డివిజన్లలో జోరుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాదరణ పొందడంలో ముందంజలో ఉన్నారు. ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, ప్రజలను కలుపుకునిపోతూ తన ఎన్నికల ప్రచారాన్ని కుప్పం ప్రసాద్ హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఒంగోలు కోటవీధిలో ప్రచారం చేయడంతో సందడి నెలకొంది. 29వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి రవి తన కుటుంబ సభ్యులు పద్మావతి, యశస్విని, సుభాషిణి.. ఒంగోలు మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ తన సతీమణి కుప్పం ప్రసన్నకుమారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి కుప్పం ప్రసాద్‌కు ఘన స్వాగతం లభించింది. పలుచోట్ల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా, ప్రజలు ఆత్మీయంగా పలకరించారు. ఏ వీధికెళ్లినా సందడి, కేరింతలు, ఆనందోత్సాహాలు కనిపించాయి. నగరంలో దాదాపు 6 డివిజన్లలో ఇప్పటికే కుప్పం పర్యటించి ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు. మహిళలతో మమేకమవుతూ ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు క్రాంతి కుమార్, యరజర్ల రమేష్, మాజీ కార్పొరేటర్ ఇంతియాజ్, షేక్ ఆశిష్, షేక్ వలి తదితరులు పాల్గొన్నారు.


