దర్శిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు ఇదేమి అన్యాయమంటూ అడిగిన వారిపై పలుమార్లు పోలీసుల లాఠీచార్జి మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు వేయిస్తామంటూ హామీ వారు చెప్పిన సమయానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అనుమతించని పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ నామినేషన్ పత్రాలతో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నిరసన నామినేషన్ కేంద్రం వద్ద కర్రలు, రాడ్లు, రాళ్లతో వందల మంది టీడీపీ గూండాల మొహరింపు వైఎస్సార్ సీపీ శ్రేణులను కవ్వించేలా చర్యలు టీడీపీ గూండాల వైపు కనీసం కన్నెత్తి చూడని పోలీసులు
పోలీసులే..
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో తహసీల్దార్ అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తహసీల్దార్ కాళ్లు మొక్కి, నామినేషన్లు వేసుకునేలా సాయం చేయాలని వేడుకున్నారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న అధికారులు, స్థానికుల హృదయాలను సైతం కదిలిచింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల బాధను చూసిన తహసీల్దార్ ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు విషయం చెప్తానని చెప్పి అక్కడి నుంచి అడ్రస్ లేకుండా మాయమైపోయాడు. తరువాత పోలీసులు యథావిధిగా తమ డ్రామాను కొనసాగించారు.
సాక్షిప్రతినిధి, ఒంగోలు:
దర్శి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకునేందుకు రెండు రోజులుగా టీడీపీ గూండాలు, పోలీసులు కలిసికట్టుగా తమ కుట్రలను పక్కాగా అమలు చేశారు. శనివారం వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుని టీడీపీ గూండాలకు సహకరించిన పోలీసులు, నామినేషన్లు చివరి రోజైనా ఆదివారం మరింత బరితెగించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవాలని, ఆ తరువాత వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలంటూ పోలీసులు సూచించారు. ఈ మేరకు టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు వేసుకునేలా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు సూచించిన విధంగా 12.30 గంటలకు నామినేషన్లు వేసేందుకు 28 వార్డుల వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థులతోపాటు, చైర్మన్ అభ్యర్థి నామినేషన్ కేంద్రానికి బయలుదేరారు. అయితే డీఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డుకు ముళ్లకంచెలను అడ్డుగా పెట్టిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని, తాము శాంతియుతంగా నామినేషన్లు వేసుకుంటామని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అయినా పోలీసులు అనుమతి నిరాకరించి ర్యాలీగా వెళ్లడానికి వీలు లేదంటూ కదలనివ్వలేదు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జ్‌కు దిగారు. నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళా అభ్యర్థులతోపాటు, వైఎస్సార్ సీపీ నాయకులపై, శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీస్ లాఠీ దెబ్బలకు తాళలేక నాయకులు, శ్రేణులు ఎటువారు అటు చెల్లాచెదురయ్యారు. అయినా సరే పోలీసులు వెంటపడి మరీ దొరికిన వారిని దొరికినట్టు లాఠీలతో చితకబాదారు.
నామినేషన్లు వేయిస్తామని నమ్మబలికి...
ఉద్రిక్త పరిస్థితులు కొంత తగ్గిన తరువాత తాము నామినేషన్లు వేసుకునేందుకు అనుమతించాలని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు మరోసారి పోలీసులకు వేడుకున్నారు. ఒక్కొక్కరుగా వస్తే మీతో నామినేషన్లు వేయిస్తామంటూ పోలీసులు ముందు నమ్మబలికారు. పోలీసులు చెప్పినట్లు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ కూడా పోలీసులు మీ అనుచరులను ఇక్కడి నుంచి పంపించి వేస్తే మిమ్మల్ని నామినేషన్ కేంద్రంలోకి పంపిస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు మరోసారి పోలీసులను నిలదీశాయి. దీంతో ఆగ్రహించిన పోలీసులు మరోసారి వైఎస్సార్ సీపీ శ్రేణులపై లాఠీచార్జ్‌కు దిగారు. దీంతో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎస్సైని కొట్టారంటూ డ్రామా...
ఒకటికి నాలుగుసార్లు పోలీసులే వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు లాఠీచార్జ్ చేశారు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో ఓ ఎస్సైకు తలకు గీసుకుపోయిన చిన్నగాయమైంది. ఈ సంఘటనను ప్రధాన అస్త్రంగా చేసుకుని వైఎస్సార్ సీపీ వాళ్లు పోలీసులపై దాడి చేశారంటూ హైడ్రామా నడిపారు. నామినేషన్లు వేసేందుకు అనుమతించాలంటూ అడ్డుకున్నారు. లేనిపోని సాకులు చెప్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేస్తూ గందరగోళ వాతావరణాన్ని అక్కడ సృష్టించారు. అయినా నామినేషన్లు వేస్తామంటూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పట్టుబట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను పోలీసులే లాక్కుని చించివేయడం గమనార్హం. ఇలా కావాలనే ఉద్దేశపూర్వంగా పోలీసులు లేనిపోని సాకులు చెప్తూ, నామినేషన్ల దాఖలు చివరి సమయం మధ్యాహ్నం మూడు గంటలు దాటే వరకు డ్రామా కొనసాగించారు. చివరకు నామినేషన్లు వేసే సమయం ముగిసిపోయింది తామేమీ చేయలేం అంటూ చేతులెత్తేశారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులను కవ్విస్తున్నా...
దర్శిలో ఈ నిబంధనలు అన్నీ కేవలం వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మాత్రమే. అదే సమయంలో కర్రలు, రాడ్లు, రాళ్లు వంటి మారణాయుధాలతో అక్కడే మోహరించిన టీడీపీ గూండాలను మాత్రం పోలీసులు పట్టించుకోలేదు. ఒకపక్క నామినేషన్లు వేసుకునేందుకు పోలీసులను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వేడుకుంటుంటే మరోవైపు వందల సంఖ్యలో గుమిగూడిన టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల వైపు ఈలలు, కేకలు వేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. ఈ సమయంలో కనీసం వారిని వారించే ప్రయత్నాన్ని కూడా పోలీసులు చేయకపోవడం గమనార్హం.
ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు ఉదయం నుంచి పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించారు. దీనిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని తన ఇంటిలోనే నిర్బంధించారు. బయటకు రావడానికి వీలు లేదంటూ పెద్ద ఎత్తున పోలీసులను ఎమ్మెల్యే ఇంటి వద్ద కాపలాగా పెట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పోలీసులు ఈ కుట్రను అమలు చేశారు. శనివారం దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రక్షణ కల్పించాలని కలెక్టర్, ఎస్పీలను కోరారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం నామినేషన్లు వేసేందుకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పినా రక్షణ కల్పించాల్సిన సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, డీఎస్పీ బాలమురళీ కృష్ణలు పచ్చ గుండాల అవతారం ఎత్తి పలుమార్లు కవ్వించి లాఠీచార్జి చేసి, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా చేయడంలో టీడీపీ నేతల కంటే పోలీసులే ప్రధాన భూమిక పోషించారు. దర్శి పట్టణంలో ప్రజలు సైతం పోలీసుల దాష్టీకం చూసి వీరు పోలీసులా ఖాకీ చొక్కాలు ధరించిన పచ్చ గుండాలా అని చర్చించుకోవడం గమనార్హం.
టీడీపీ నాయకుడి అనుమతి తీసుకుని రా...అభ్యర్థులకు ఎస్సై సూచన
దర్శి నామినేషన్ల ప్రక్రియలో పోలీసుల అరాచకపర్వం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రఘు అనే అభ్యర్థి నామినేషన్ కేంద్రంలోకి వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న ఓ ఎస్సై రఘుని అడ్డుకుని నామినేషన్ పత్రాలు చూపించాలని డిమాండ్ చేశాడు. పత్రాలు తీసుకుని టీడీపీ నాయకునికి చూపించి అతని అనుమతి తీసుకుని రావాలని పంపించారు. నామినేషన్ కేంద్రంలోనే ఉన్న టీడీపీ నాయకుడి కర్ణా శ్రీను వద్దకు రఘును పంపించారు. రఘు నామినేషన్ పత్రాలను లాక్కున్న కర్ణా శ్రీను నీవు ఎవరి తరఫున నామినేషన్ వేయడానికి వచ్చావో మాకు తెలుసు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది.. లేదంటే తన్నులు తింటావంటూ బెదిరింపులకు దిగాడు. పైగా నామినేషన్ వేయనిచ్చే ప్రసక్తే లేదని, కేంద్రం నుంచి వెళ్లిపోవాలని సదరు టీడీపీ నాయకుడు బెదిరించాడు. దీంతో చేసేదేమీ లేక రఘు అక్కడి నుంచి నామినేషన్ వేయకుండానే వెళ్లిపోయాడు. పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్‌ను బలపరిచేందుకు వచ్చిన వ్యక్తిని చుట్టుముట్టి లాఠీలతో కొడుతున్న పోలీసులు
ప్రజాస్వామ్యంలో ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన పోలీసులే పచ్చచొక్కాలు వేసుకుని అధికార పార్టీకి కొమ్ముకాస్తే ఎన్నికల నిర్వహణ ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి దర్శి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. టీడీపీ అభ్యర్థులకు పోటీ లేకుండా చేసేందుకు పోలీసులే కంకణం కట్టుకుని మరీ వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై లాఠీలతో విరుచుకుపడి, నామినేషన్లు వేయకుండా పత్రాలు చించేశారు. చివరకు వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి సహా వార్డు సభ్యుల అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.


