ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరాన్ని రాష్ట్రంలోనే మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానని వైఎస్సార్ సీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఒంగోలు ఆర్డీవో టీ.చంద్రశేఖర్ వద్ద నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎంతగానో సేవ చేస్తూ వచ్చానని, పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని కుప్పం ప్రసాద్ చెప్పారు. మేయర్ పదవిని గెలుచుకొని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గిఫ్ట్‌గా ఇస్తానన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఇప్పటికీ మరువలేకున్నారని చెప్పారు. ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడుగా ఎనిమిదేళ్లు కష్టపడి పనిచేశానన్నారు. ప్రతి వార్డు తిరిగానని, నగరంలోని ప్రతి మనిషితో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఒంగోలు నగరంలో వరదలు వచ్చినప్పుడు మారుమూల ప్రాంతాలకు వెళ్లి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు.
కూటమి పాలనలో నగర అభివృద్ధి శూన్యం:
టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఒంగోలు నగరం అభివృద్ధి జరగలేదని కుప్పం ప్రసాద్ అన్నారు. చిన్న వర్షం పడితేనే నగరం జలమయం అవుతుందని గుర్తు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాటలకే పరిమితమైందని విమర్శించారు. పేద ప్రజలకు ప్లాట్లు ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు పూర్తయినా వాటి ఊసే లేదని ధ్వజమెత్తారు. ఒంగోలు నగరాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు నగర ప్రజలు ఒక్క అవకాశం తనకు ఇవ్వాలని వేడుకున్నారు. అభివృద్ధిని చేసి చూపిస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి మేయర్ అభ్యర్థిత్వం వచ్చేందుకు సహకరించిన రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వైవీ.సుబ్బారెడ్డి, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పార్లమెంటరీ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవి బాబు, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్‌తో పాటు పలువురు నాయకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఒంగోలు నగరంలో ఓట్ల భూకంపం సృష్టిస్తాం : చుండూరు రవిబాబు
ఒంగోలు నగరంలో నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఓట్ల భూకంపం సృష్టిస్తా మని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పార్టీకి చెందిన అందరు కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీలతో గెలిపించుకుంటామని చెప్పారు. పార్టీ విధేయుడైన నాయకుడికి పార్టీ మేయర్ అభ్యర్థిత్వాన్ని ఇచ్చామన్నారు. వైఎస్సార్ సీపీ తరఫున డివిజన్లలో ఎంపిక చేసిన కార్పొరేటర్ అభ్యర్థులను కూడా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను నిలబెట్టామని వివరించారు. టీడీపీ కూటమి నాయకులు ఎటువంటి అభ్యర్థిని ఎంపిక చేశారో ఒంగోలు నగర ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి పార్టీల తరఫున మేయర్‌గా పోటీలో నిలబెట్టిన అభ్యర్థి భర్త నల్లమల్లి బాలు మీద ఎమ్మెల్యే దామచర్ల గతంలో ఎన్ని ఆరోపణలు చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలో ఓట్ల భూకంపం సృష్టిస్తాం అని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, కుప్పం సతీమణి ప్రసన్న కుమారితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


