● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం
యర్రగొండపాలెం:
ప్రజాస్వామ్య పోరులో గెలువలేక టీడీపీ వర్గీయులు దాడులకు దిగుతున్నారని వైఎస్సార్ సీపీ వర్గీయులను నామినేషన్ కేంద్రాలవద్ద అటకాయించి నామినేషన్ ఫారాలు చించి వేస్తున్నారని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. స్థానిక మంజునాధ కల్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన పెద్దారవీడు మండల వైఎస్సార్ సీపీ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు పాలిరెడ్డి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. పక్కదారిలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను సైతం అదే పద్ధతిలో చేచిక్కించుకోవాలనుకుంటున్నారని, అటువంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. మండలంలోని ఎంపీపీ, జెడ్పీటీసీ పీఠాలను వైఎస్సార్ సీపీ వర్గీయులే అత్యధిక మెజార్టీతో దక్కించుకోవాలని, ప్రతి పంచాయతీలో ఉన్న ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్లను గెలిపించుకోవటానికి కార్యకర్తలు తమవంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ నాయకత్వమే సమావేశాలు ఏర్పాటు చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని, అప్పుడే తామందరం అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయని తెలిపారు. రాష్ట్రంలో రెండున్నరళ్లుగా అరాచకాలు సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్లాలని, గత ప్రభుత్వ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టి అమలుపరిచిన పథకాల గురించి వివరించి ఓటు అడగాలని ఆయన అన్నారు. టీడీపీ వర్గీయులకు అటువంటి పరిస్థితి లేదని, ప్రజల ముందుకు వెళ్లలేకే దాడులకు పాల్బడుతున్నారని, ప్రజా స్వామ్యంగా ఎన్నికల బరిలో దిగుతున్న వైఎస్సార్ సీపీ వర్గీయుల ధాటికి తట్టుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారని, చేసేదిలేక పోలీసుల అండదండలతో నామినేషన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అటువంటి బెదిరింపులకు భయపడకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఎన్నికల బరిలో దిగుతారన్నారు. ప్రతి ఎంపీటీసీ, సర్పంచ్ల స్థానాల్లో తమ వర్గీయులు పోటీలో ఉంటారని, అందుకు ఎదుర్కొనేందు సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ ఎంపీపీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ యేర్వ చలమారెడ్డి, వివిధ విభాగాల నాయ కులు జి.వెంకటేశ్వరరెడ్డి, షేక్ బుజ్జి, యేర్వ చిన్నకోటిరెడ్డి, పోతంపల్లి వెంకటరెడ్డి, తోకల ఆవులయ్య, శేషసేనారెడ్డి, వేలూరి నారాయణరెడ్డి, ఆదినారాయణ యాదవ్, గోపాల్రెడ్డి, ఉప్పలపాటి పెద్దకాశయ్య, మూల రమణారెడ్డి, ఆదాం, ఎం.రామస్వామిరెడ్డి, సుబ్బయ్య, రామాయపాలెం సుబ్బాడ్డి, మూడమంచు రాజారావు, వెన్నా రామిరెడ్డి, నాగరాజు, దండా కృష్ణారెడ్డి, పోతంపల్లి రామాంజనేయరెడ్డి, వెన్నా శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
సమావేశంలో పాల్గొన్న పెద్దారవీడు మండల నాయకులు, కార్యకర్తలు


