కనిగిరిలో ఖాకీల అరాచకం | - | Sakshi
Sakshi News home page

కనిగిరిలో ఖాకీల అరాచకం

Oct 19 2026 2:13 AM | Updated on Oct 19 2026 2:13 AM

నామినేషన్‌ కేంద్రంలోనే టీడీపీ నేతల తిష్ట సంపూర్ణ సహకారం అందించిన పోలీసులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడి, నామినేషన్‌ పత్రాల చించివేత కనిగిరిలో పోలీసుల సాక్షిగా టీడీపీ గూండాల అరాచకపర్వం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కనిగిరిలో పోలీసుల అండతో టీడీపీ గూండాలు పెట్రేగిపోయారు. నామినేషన్‌ కేంద్రాలను తమ అదుపులోకి తీసుకుని బీభత్సం సృష్టించారు. నామినేషన్‌ కేంద్రం ఆవరణలోకి వందలాది మంది టీడీపీ గూండాలను దగ్గరుండి పోలీసులు అనుమతించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, శ్రేణులను మాత్రం నామినేషన్‌ కేంద్రంలోకి కూడా అనుమతించకుండా పోలీసులు దగ్గరుండి దాడులు చేశారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరిని మాత్రమే నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతించారు. అయితే టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతో ఆర్వో వద్దనే 15 మంది టీడీపీ గుండాలను పెట్టారు. అందులో 10 మంది మగ, మరో 5 మంది ఆడవారిని ఉంచారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పురుషులు అయితే ఈ 10 మంది గూండాలు నామినేషన్‌ పత్రాలు మర్యాదగా ఇచ్చిపోవాలని బెదిరింపులకు దిగారు. ఇవ్వకపోతే కొట్టి పత్రాలు లాక్కొని బయటకు నెట్టడం కనిపించింది. మహిళా అభ్యర్థులైతే ఆర్వో వద్దనే ఉన్న ఐదు మంది మహిళలు వారి నుంచి నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు. ఇలా 10, 7, 32, 31, 17, 18 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించేశారు.

చైర్మన్‌ అభ్యర్థి తల్లి నామినేషన్‌ను సైతం ...

కనిగిరిలో వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పులిశాంతి నామినేషన్‌ వేశారు. ఈమె తల్లి పులి లక్ష్మీ 32వ వార్డుకు నామినేషన్‌ వేసేందుకు ఆర్వో వద్దకు వెళ్లారు. ఆర్వో చేతికి నామినేషన్‌ పత్రాలను ఇచ్చారు. అయితే వెంటనే డీఎస్పీ, సీఐ, ఎస్సై చేరుకుని ఆర్వో చేతిలోంచి పత్రాలను లాక్కొని చించి బయటకు పంపించి వేశారు. నామినేషన్‌ కేంద్రంలోనే భయానక వాతావరణాన్ని సృష్టించారు.

వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై పోలీసుల దాడి

నామినేషన్‌ కేంద్రం ఆవరణలోనే 400 మంది టీడీపీ గూండాలు టెంట్‌ వేసుకుని హంగామా చేస్తున్నా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్‌లు వేయకుండా టీడీపీ గూండాలు పత్రాలను చించి వేస్తున్నారనే విషయం తెలుసుకుని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ దద్దాల నారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభ్యర్థులతో నామినేషన్‌ వేయించేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరిని నామినేషన్‌ కేంద్రానికి 400 మీటర్ల దూరంలోనే బారికేడ్‌లు పెట్టి డీఎస్పీ, సీఐ, ఐదుగురు ఎస్సైలు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి వారిని అడ్డుకుని లాఠీలు ఝళిపించి భయభ్రాంతులకు గురిచేశారు. సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై సందీప్‌లు ఓవర్‌యాక్షన్‌ చేశారు. మొత్తం మీద ఏడుగురు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థుల నామినేషన్‌లు వేయకుండా పోలీసులు అడ్డుకుని గందరగోళం సృష్టించారు.

18వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిపై భౌతిక దాడి..

వైఎస్సార్‌ సీపీ 18వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్ధి ఎస్‌కే సమీరాపై అతని భర్త ఎస్‌కే ఉమర్‌ ఫారూక్‌, బంధువుపై అధికార పార్టీ పార్టీ నాయకులు తీవ్రంగా దాడి చేశారు. అలాగే పదో వార్డుకు చెందిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి షఫీ నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేశారు. సమీరా..రోడ్డుపై పడుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఫిరోజు, వార్డు అభ్యర్ధి ఎస్‌కే ఖాదర్‌లు కొట్టి నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించేశారని సమీరా, ఆమె భర్త ఎస్‌కే ఉమర్‌ ఫరూక్‌లు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసు అధికారులు సైతం అధికార పార్టీ వారికి అండగా నిలిచి తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు.

పోలీసులు కాళ్లు పట్టుకున్నా లోపలికి పంపలేదు..

18వ వార్డు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్ధి సమీరా..మళ్లీ నామినేషన్‌ దాఖలు చేసేందుకు పత్రాలు తీసుకుని గం.2.45కు నామినేషన్‌ కేంద్రం వద్దకు వచ్చింది. అయినా పోలీసులు లోపలికి అనుమతించ లేదు. అభ్యర్థి సమీరా కాళ్లు పట్టుకున్నా లోపలికి పంపలేదు. దీంతో పోలీసుల తీరుపై, అధికార పార్టీ నేతల దౌర్జన్యంపై పార్టీ కనిగిరి కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌, పార్టీ మున్సిపల్‌ అభ్యర్థి పులి శాంతిరెడ్డి, పీడీసీసీబీ మాజీ చైర్మన్‌ వైఎం ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement