వెన్ను చూపేది లేదు దేనికై నా రెఢీ స్థానిక సమరానికి వైఎస్సార్ సీపీ సిద్ధం పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి
కురిచేడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. వెనకడుగు వేసేది లేదని, వెన్ను చూపేది లేదని, దేనికై నా సిద్ధమని స్పష్టం చేశారు. స్థానిక దర్శి రోడ్డులోని గుంటకనాసరరెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం పార్టీ సీఎంసీ సభ్యురాలు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి ప్రతి పదవికి పోటీచేసేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. పోటీ చేసే వారి జాబితా తయారు చేశారు. ప్రతిఒక్కరూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి వీరసైనికుల్లా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఎన్నికల సమరంలో ముందుకు సాగాలని సూచించారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ప్రతిపక్ష పార్టీ కొన్నిచోట్ల పోటీ చేయలేకపోయిందని, కానీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని బూచేపల్లి ప్రకటించారు.
కూటమి పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు...
కూటమి పాలనలో నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటి పేద, మధ్య తరగతి ప్రజలు పచ్చడి మెతుకులు కూడా తినలేని పరిస్థితి నెలకొందని బూచేపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. 25 కిలోల బియ్యం బస్తా రూ.2 వేలు పలుకుతోందన్నారు. పంటలు పండిద్దామంటే ఎల్నినో వలన చుక్క నీరు లేదని, కరువు తాండవిస్తూ తాగునీరు కూడా దొరక్క ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం కనీస కరువు నివారణ చర్యలు కూడా చేపట్టకుండా ప్రజలను గాలికొదిలేసిందని బూచేపల్లి మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జగనన్న చర్యలు చేపట్టిన విషయాన్ని వివరించారు. ప్రజలు ఆలోచించుకుని తిరిగి రాజన్న రాజ్యం కోసం జగనన్నను సీఎంను చేసుకునేందుకు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం.దేవప్రసాదు, జిల్లా అధికార ప్రతినిధి గోగులముడి లింగారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నుసుం వెంకట నాగిరెడ్డి, మండల అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, ఉపాధ్యక్షులు ఊట్ల వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు అంకె గోపాలకృష్ణ, సారెడ్డి నాగిరెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మూలె నాగమణి, బోధనంపాడు గ్రామ అధ్యక్షుడు వేమా వెంకటేశ్వర్లు, నాయకులు కే కృష్ణయ్య, కే నాగేశ్వరరావు, బీ వెంకటనర్సయ్య, వెంకటనారాయణ, కే నరసింహులు, బీ మహేష్, షేక్ కాశిం, కండె గంగయ్య, రమణారెడ్డి, ఇందూరి సుబ్బారెడ్డి, పి.వెంకటరెడ్డి, చెంచయ్య, కర్నాటి వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, ఆర్.గురుప్రసాదు, నుసుం సుబ్బారెడ్డి, చంటి, చెన్నంశెట్టి గురవయ్య, ఆసుపల్లి చెన్నారెడ్డి, పెండ్యాల సాంబశివరావు, చిన్ని కార్తీక్, నారు రమణారెడ్డి, గుంజా ఫణీంద్ర, నక్కా బుజ్జి, నక్కా అంజి, కే జోసఫ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


