ఒంగోలులో మాజీ కార్పొరేటర్ ఇంతియాజ్ సహా 20 మందికి పార్టీ కండువాలు కప్పిన చుండూరి రవిబాబు
ఒంగోలు సిటీ: జనసేన పార్టీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒంగోలు బండ్లమిట్టకు చెందిన కావేటి రవి, మాజీ కార్పొరేటర్ ఇంతియాజ్ సహా 20 మందిని వైఎస్సార్ సీపీలోకి ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు ఆహ్వానించారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ పార్టీ స్థాపించినప్పటి నుంచి వైఎస్సార్ సీపీకి అంకితభావంతో సేవలందిస్తున్న కుప్పం ప్రసాద్ను ఒంగోలు నగర మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషకరమన్నారు. ఆయన గెలుపు కోసం జగనన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుప్పం ప్రసాద్ వైఎస్సార్ సీపీకి ఎనలేని సేవలు అందించారని, ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కరోనా సమయంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. ఆ ప్రభుత్వ హయాంలో వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల కష్టాలపై బాధ్యత లేదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా ఒంగోలు వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.


