నాలుగు పురాలకు లైన్‌ క్లియర్‌ | - | Sakshi
Sakshi News home page

నాలుగు పురాలకు లైన్‌ క్లియర్‌

Oct 17 2026 8:30 AM | Updated on Oct 17 2026 8:30 AM

● దర్శి, అద్దంకి, గిద్దలూరు, చీమకుర్తిలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఖరారు ● అద్దంకి, మార్కాపురానికి టీడీపీ అభ్యర్థులప్రకటన

● దర్శి, అద్దంకి, గిద్దలూరు, చీమకుర్తిలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఖరారు ● అద్దంకి, మార్కాపురానికి టీడీపీ అభ్యర్థులప్రకటన

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమి పార్టీల కంటే పురపోరులో వైఎస్సార్‌ సీపీ ముందుకు దూసుకుపోతోంది. పక్కా ప్రణాళికతో అభ్యర్థులను ప్రకటిస్తూ కదనరంగంలో సత్తా చాటేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. కూటమి పార్టీలు పొత్తులతో సతమతమవుతూ అభ్యర్థుల ఖరారుపై గందరగోళంలో ఉండగా వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించింది. గురువారం రాత్రి ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, కనిగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పులిశాంతిలను ప్రకటించింది. శుక్రవారం రాత్రి పార్టీ కేంద్రకార్యాలయం విడుదలజేసిన జాబితాలో దర్శి, చీమకుర్తి, గిద్దలూరు, అద్దంకిలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. దర్శికి వెన్నపూస వెంకటరెడ్డి, చీమకుర్తికి మేడగం శ్రీదేవి, గిద్దలూరుకు భూమా నరసింహారెడ్డి, అద్దంకికి ఉడత్తు సురేష్‌ను పార్టీ ఖరారు చేసింది. దర్శి అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డి(మహేష్‌) 15 సంవత్సరాలుగా దర్శి మండల కన్వీనర్‌గా పనిచేశారు. కార్యకర్తలకు ఏ ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడ్డారు. అద్దంకి అభ్యర్థి ఉడుత్తు సురేష్‌ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షునిగా ఉన్నారు. పట్టణంలోని అన్ని వర్గాల వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ అంచెలంచలుగా ఎదిగారు. పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. చీమకుర్తి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎంపికై న మేడగం శ్రీదేవి గతంలో చీమకుర్తి సొసైటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆమె భర్త రమణారెడ్డి కూడా చీమకుర్తి సొసైటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. గిద్దలూరు అభ్యర్థి భూమా నరసింహారెడ్డి పట్టణంలో వైద్యునిగా అందరికీ సుపరిచితులు. అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ విడుదలజేసిన అభ్యర్థుల జాబితాలో మార్కాపురానికి వక్కలగడ్డ మల్లికార్జున, అద్దంకికి కాకాణి అశోక్‌ పేర్లను ప్రకటించారు. ఒంగోలు కార్పొరేషన్‌కు సంబంధించి గంటకోపేరు ప్రచారానికి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement