ఉలవపాడు:
పెదపట్టపుపాలెంగ్రామం.. తీరప్రాంతంలో బలమైన మత్స్యకార గ్రామం. 98 శాతం మంది మత్స్యకారులు, రెండు శాతం ఓసీ, ఎస్టీలు నివాసం ఉంటారు. ఇక్కడ ఇంతవరకు స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఎంపీటీసీలకు సంబంధించి ఎన్నికలు జరగలేదు. గ్రామం అంతా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటారు. వారే సర్పంచ్, ఎంపీటీసీలుగా నామినేషన్ వేస్తారు.. ఏకగ్రీవమవుతారు. ఉలవపాడు మండల పరిధిలోని చాకిచర్ల గ్రామ పంచాయితీ పరిధి నుంచి 1998 జూన్‌లో పెదపట్టపుపాలెం గ్రామ పంచాయితీ 4239 మంది జనాభాతో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 5 సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా ఐదుసార్లు ఏకగ్రీవంగానే సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. 2005 లో పెదపట్టపుపాలెం ఎంపీటీసీ ప్రాదేశికంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 4 సార్లు ఎంపీటీసీ ఎన్నికలు జరగగా 4 సార్లు ఎంపీటీసీ సభ్యులను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆరోసారి సర్పంచ్ ఎన్నికలు, ఐదోసారి ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈగ్రామంలో మొత్తం 3439 మంది ఓటర్లున్నారు. ఈ సారి కూడా గ్రామ కాపులు, పెద్దలు గ్రామస్తులతో కలిసి సర్పంచ్, ఎంపీటీసీలను నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఐదుసార్లు మత్య్సకారులే ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారు. సర్పంచ్ లుగా 4 సార్లు మత్య్సకారులు ఎన్నికవ్వగా ఒకసారి మాత్రం ఎస్టీ మహిళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 15 ఏళ్ల క్రితం వరకు ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో కూడా గ్రామం అంతా నిర్ణయించుకుని ఒక అభ్యర్థికే ఓటు వేసేవాళ్లు. కానీ ప్రస్తుతం పార్టీల వారీగా ఓట్లు వేస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం ఏకగ్రీవంగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచ్ అన్‌రిజర్వుడు మహిళకు కేటాయించారు. కానీ బీసీ మత్స్యకార మహిళనే సర్పంచ్‌గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఎంపీటీసీ కూడా అన్‌రిజర్వుడు కాగా మత్య్సకార వ్యక్తినే ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఏకగ్రీవ పంచాయతీలకు అందించే పారితోషికాలను కూడా గతంలో ఈ పంచాయతీ అందుకుంది.
ఇప్పటివరకు సర్పంచ్, ఎంపీటీసీ
ఎన్నికలే జరగని గ్రామం
పెదపట్టపుపాలెంలో గ్రామ నిర్ణయమే అంతిమం
పెద్దలు నిర్ణయించినవారే సర్పంచ్,
ఎంపీటీసీలు


