దర్శి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ వి.హర్షవర్థన్ రాజు గురువారం దర్శి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, గాంధీనగర్లోని ప్రాథమిక పాఠశాల, చింతలపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు, చెక్పోస్ట్ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, భౌగోళిక పరిస్థితులు, రాకపోకల మార్గాలు, రూట్ మ్యాప్లు, స్ట్రాంగ్ రూమ్ల భద్రత తదితర అంశాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో శుక్రవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ క్రమంలో దర్శి మున్సిపల్ పరిధిలోని మూడు సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను సందర్శించి ఒకేలొకేషన్లో ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉండటం, గతంలో జరిగిన సంఘటనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. దర్శి మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు, 14 పోలింగ్ లొకేషన్లు, 51 పోలింగ్స్టేషన్లు ఉండగా సుమారు 29 వేల మందికిపైగా ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు శాఖకు, జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియలో దర్శి మున్సిపల్ పరిధిలో మూడు చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత నెల రోజులుగా విస్తృతంగా పల్లెనిద్ర కార్యక్రమాలు, పోలింగ్ స్టేషన్ల విజిట్, సమస్యాత్మక గ్రామాల పర్యటనలు, నాన్ బెయిల్బుల్ వారెంట్ల అమలు పరచటం, రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్ను ముందస్తుగా బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు శాఖ కృషి చేస్తోందని ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్.యుగంధర్బాబు, దర్శి డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, దర్శి సీఐ నాగమల్లేశ్వరరావు, దర్శి ఎస్సై ఏడుకొండలు ఉన్నారు.
ఎస్పీ హర్షవర్థన్ రాజు


