ఒంగోలు సిటీ:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్న్చార్జి చుండూరి రవిబాబు విమర్శించారు. గురువారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చుండూరి రవిబాబు మాట్లాడుతూ వ్యాపారులు అప్పులపాలుకాకుండా, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చూడటంతో పాటు విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చామని ఆయన గుర్తు చేశారు.
విద్య, వైద్య రంగాలపై నిర్లక్ష్యం తగదు
పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉండాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల భారం తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయకుండా చర్యలు తీసుకోవాలని రవిబాబు సూచించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. విద్య, వైద్యం కోసం కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాకూడదన్నారు.
హామీల అమలుపై నిలదీత
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని రవిబాబు డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.1,500 అందిస్తామన్న హామీ, 20 లక్షల ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరగాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని చుండూరి రవిబాబు కోరారు.
వ్యాపారులపై అప్పుల కత్తి
హామీల అమలులో చంద్రబాబు విఫలం
వైఎస్సార్ సీపీని గెలిపిస్తే ప్రజా
సంక్షేమానికి పెద్దపీట
ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి
చుండూరి రవిబాబు
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికలు
సోఫియా బాచి ఆధ్వర్యంలో పలువురు చేరిక
ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏడో డివిజన్ నాయకురాలు, ఏపీ నూర్బాషా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ సోఫియా బాచి, షేక్ బాచీ దంపతులు ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకరరావు, ఒంగోలు మైనారిటీ సెల్ అధ్యక్షుడు చాంద్బాషా ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.


