రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య అదుపుతప్పి కారు బోల్తా వై.పాలెం సర్కిల్లో 470 మంది బైండోవర్‌ నాణ్యమైన విద్యుత్‌ అందించాలి ఉద్యోగం పేరుతో మోసం

గిద్దలూరు రూరల్‌: కుటుంబ కలహాల కారణంగా రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కె.ఎస్‌.పల్లె సమీప రైల్వే ట్రాక్‌పై గురువారం వేకువ జామున జరిగింది. అందిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలం జె.పి.చెరువు గ్రామానికి చెందిన టి.సుబ్బయ్య (55) తరుచూ మద్యం తాగి కుటుంబ సభ్యులతో ఘర్షణ పడేవాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో బుధవారం ఘర్షణ పడి గిద్దలూరు వచ్చాడు. నంద్యాల వైపు నుంచి గుంటూరు వైపుగా వెళ్లే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న నంద్యాల జీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

● ఇద్దరికి గాయాలు

పొదిలి రూరల్‌: అదుపుతప్పి కారు బోల్తా పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పొదిలి మండలంలోని ఉప్పలపాడు వద్ద గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పొదిలి విశ్వనాథపురంలో నివాసం ఉంటున్న రాచమళ్ల వెంకట రామిరెడ్డితో పాటు జానీ సొంత పనులపై కారులో ఒంగోలు వెళ్లి తిరిగి పొదిలి వస్తున్నారు. మార్గమధ్యంలోని ఉప్పలపాడు సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న రాచమళ్ల వెంకటరామిరెడ్డితో పాటు జానీకి గాయాలయ్యాయి. కారు ధ్వంసమైంది. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు.

యర్రగొండపాలెం: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురువారం పోలీసులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 470 మందిని బైండోవర్‌ చేసుకున్నారు. యర్రగొండపాలెం మండలంలో 160 మంది, పుల్లలచెరువు మండలంలో 250, పెద్దదోర్నాల మండల పరిధిలో 60 మంది చొప్పున బైండోవర్‌ చేసినట్లు సీఐ అజయ్‌కుమార్‌ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 51 పంచాయతీల్లో ఉన్న అనుమానితులను బైండోవర్‌ చేసుకున్నామని, మరి కొంతమందిని బైండోవర్‌ చేసుకోనున్నట్లు చెప్పారు.

● ఆ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు

ఒంగోలు సబర్బన్‌: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని ఏపీసీపీడీసీఎల్‌ జిల్లా ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక రామ్‌నగర్‌లోని విద్యుత్‌ భవన్‌లో గురువారం విద్యుత్‌ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు సీనియారిటీ ప్రకారం రైతులకు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. విద్యుత్‌ పరివర్తకాల పనితీరును, స్మార్ట్‌ మీటర్ల గురించి అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ శాఖ మీద ప్రజల అభిప్రాయం, నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ అందించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు..వాటి ప్రణాళికలు గురించి చర్చించారు. జీఐఎస్‌ మ్యాపింగ్‌, డీఆర్‌టీ మ్యాపింగ్‌ అన్ని 33 కేవీ, 11 కేవీ ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు అనుసంధానమైన సర్వీసుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచడం ద్వారా వినియోగదారులకు సత్వరం సేవలు అందిచవచ్చిని చెప్పారు. విద్యుత్‌ కలెక్షన్లు, బకాయిలు మీద సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అధికారులు ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ అందరికీ అందించాలని, దానికోసం ఫీడర్‌ పెట్రోలింగ్‌ చేసి లోపాలను సరి చేయాలని, తద్వారా ప్రజలకు విద్యుత్‌ శాఖ పట్ల శాటిస్పేక్షన్‌ లెవెల్స్‌ పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.

యర్రగొండపాలెం: ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించి రూ.5.80 లక్షలు కాజేసినట్లు గురువారం బాధితుడు నేనావత్‌ నాగరాజు నాయక్‌ గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. త్రిపురాంతకానికి చెందిన కె.చంద్రశేఖరరావు, రాజమండ్రికి చెందిన చిన్నారావు, విజయవాడకు చెందిన అజయ్‌కుమార్‌లు 2024లో నాగరాజు నాయక్‌కు ఇరిగేషన్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి విడతల వారీగా రూ.5.80 లక్షలు తీసుకున్నారని, ఉద్యోగం ఇప్పించక పోవడంతోపాటు ఫిర్యాది నుంచి తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా మోసపు మాటలు చెప్తూ కాలం గడుపుతూ వచ్చారని తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement