ఒంగోలు, కనిగిరి అభ్యర్థుల ప్రకటన ఒంగోలుకు కుప్పం ప్రసాద్, కనిగిరికి పులిశాంతి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయితీ కొనసాగుతుండగా.. వైఎస్సార్ సీపీ ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు కనిగిరి మున్సిపాలిటీకి అభ్యర్థులను ప్రకటించి స్థానిక ఎన్నికల రంగంలో ముందుకు దూసుకుపోతోంది. ముందు నుంచీ పార్టీ స్థానిక ఎన్నికలపై కసరత్తును వేగవంతం చేసింది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించింది. మేయర్, మున్సిపల్ చైర్మన్, వార్డు సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావహుల జాబితాలను సిద్ధం చేసింది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి తుది జాబితాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు సమాచారం. గురువారం రాత్రి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది అభ్యర్థుల జాబితాను విడుదలజేసింది. ఒంగోలు కార్పొరేషన్, కనిగిరి మున్సిపాలిటీలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ను ఒంగోలు మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కనిగిరి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పులిశాంతిని చైర్పర్సన్ అభ్యర్థిగా ఖరారు చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకొని ఉన్న కుప్పం ప్రసాద్ మేయర్ అభ్యర్థిగా రంగంలో దిగనున్నారు. ఒంగోలు నగర పాలక సంస్థలో ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకటైన వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుప్పంను ఎంపిక చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎంతగానో సేవ చేస్తూ వచ్చిన కుప్పం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడుగా పనిచేశారు. కనిగిరి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఎంపికై న పులి శాంతి గోవర్ధన్‌రెడ్డి దివంగత కేంద్ర మంత్రి పులి వెంకట రెడ్డి మనవరాలు. తండ్రి దివంగత పులి వెంకట రమణారెడ్డి జెడ్పీటీసీల సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈమె తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా మార్కాపురం, గిద్దలూరు, దర్శి, చీమకుర్తి, అద్దంకి మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.
కష్టపడేవారికి సముచిత స్థానం..
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి తనపై నమ్మకం ఉంచి ఒంగోలు మేయర్ అభ్యర్ధిత్వం తనకు ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని కుప్పం ప్రసాద్ అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని పార్టీ కేడర్‌కు ఒక భరోసా ఇచ్చినట్లయిందన్నారు. ఒంగోలు మేయర్ పదవిని గెలుచుకొని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానన్నారు. ఒంగోలు నగరంలో టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన లోపభూయిష్టంగా ఉందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలు ఇప్పటికీ మరువలేకున్నారని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి మేయర్ అభ్యర్దిత్వం వచ్చేందుకు సహకరించిన రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వైవీ.సుబ్బారెడ్డి, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్‌తో పాటు పలువురు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కనిగిరిలో జోష్..
పులి శాంతి రెడ్డి పేరును వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేయడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. రాజకీయ కుటుంబ నేపథ్యంతో పాటు, విద్యావంతురాలు కావడం, పట్టణంలో విస్తృత స్థాయి పరిచయాలు ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశం. పులి శాంతిరెడ్డి పేరు ఖరారు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు.


