కష్టాలు ఘాటెక్కి
జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో మిర్చి సాగు గుంటూరు యార్డులో తగ్గుతున్న ధరలు వారంలోనే క్వింటాకు రూ.2 వేలు పతనం తెగుళ్ల దాడితో భారీగా పడిపోయిన దిగుబడి ఎకరాకు రూ.20 వేల వరకూ నష్టం ఆందోళనలో మిర్చి రైతులు అమలుకాని ప్రభుత్వ మిర్చి క్లస్టరు హామీ ఈ ఏడాదీ మార్కాపురంలో ఏర్పాటుకాని కొనుగోలు కేంద్రం
మార్కాపురం: ఎర్ర బంగారమని నమ్మి సాగు చేసిన మిర్చి రైతులు తెగుళ్ల దాడితో నట్టేట మునిగిపోయారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో మిర్చిసాగు చేపట్టారు. జిల్లాలో ప్రధానంగా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో మిర్చి ఎక్కువగా సాగు చేశారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లతో పోల్చుకుంటే సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది మోంథా తుఫాను తరువాత తెగుళ్లు విజృంభించాయి. మిర్చికి నల్లతామర, కుచ్చుముడత (వైరస్) తెగుళ్లు సోకాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో ఈ తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా ఎకరాకు 2 క్వింటాళ్ల చొప్పున మొదటి రెండు కోతల్లోనే దిగుబడులు పడిపోయాయి. దీంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 96 వేల ఎకరాల్లో సాగుచేయగా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2024లో 66,387 ఎకరాల్లో సాగు చేశారు. ఈ దఫా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 50 వేల ఎకరాలకు మాత్రమే పరిమితమయ్యారు.
ఎకరాకు లక్షన్నర ఖర్చు..
ఎకరా మిర్చిసాగుకు సుమారు రూ.లక్షన్నర వరకూ ఖర్చు వస్తోంది. ప్రధానంగా రైతులు పోటీలుపడి అధిక దిగుబడుల కోసం ఎరువులు, పురుగు మందులను వాడుతున్నారు. ఎకరాకు దాదాపు 25 నుంచి 30 బస్తాల వరకూ పొటాష్, యూరియా 25:25 రకాలను వినియోగిస్తున్నారు. సేద్యపు ఖర్చులు, పురుగుమందులు, కోతలు కలిపి రూ.లక్షన్నర వరకూ ఖర్చు వస్తోంది. దిగుబడులు అయితే ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ వస్తాయని ఆశించగా వైరస్ తెగుళ్లతో 25 నుంచి 30 క్వింటాళ్ల మధ్య దిగుబడులు వస్తున్నాయి. ఒక్కొక్క రైతు క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టపోతున్నారు.
అమలుకు నోచుకోని మిర్చి క్లస్టరు
పశ్చిమ ప్రకాశంలో మిర్చి క్లస్టరు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో ఘనంగా ప్రకటించింది. ఏడాది దాటినా హామీ అమలుకు నోచుకోలేదు. దీంతోపాటు మిర్చి కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని గత ఏడాది జిల్లా అధికారులు ఇచ్చిన హామీ ఇచ్చినా ఈ ఏడాది కూడా అమలుకాకపోవడం గమనార్హం. మిర్చి రైతులు ఈ ఏడాది కూడా గుంటూరు మార్కెట్ యార్డుకు లారీలను బాడుగకు మాట్లాడుకుని తీసుకెళ్లారు. దీంతో బాడుగ ఖర్చులే రైతులకు భారమవుతున్నాయి. పాలకులు తమ కష్టాలను పట్టించుకోవడంలేదని రైతులు మండిపడుతున్నారు.
పడిపోతున్న ధరలు
మిర్చి రైతుకు ఈ ఏడాది కూడా నష్టాల పోటు తప్పట్లేదు. మార్కెట్లో ధరలు పతనం రైతుకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గుంటూరు మార్కెట్ యార్డులో ప్రస్తుతం యూఎస్ 341 రకం క్వింటా రూ.23 వేల నుంచి రూ.24 వేల మధ్య ఉండగా, తేజ రకం రూ.20 వేల నుంచి రూ.21 వేల మధ్య ఉంది. గత వారం యూఎస్ 341 రకం క్వింటా దాదాపు రూ.26 వేలు పలికింది. తేజ రకం ప్రస్తుతం రూ.19 వేలకు కొనుగోలు చేస్తున్నారు. తాలుకాయలైతే క్వింటా రూ.10 వేలకు మాత్రమే ధర పలుకుతోంది. వారం రోజుల్లోనే క్వింటా ధర రూ.2 వేలు పతనమవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకూ ధరలు తగ్గిపోతుండటంతో రైతులు నట్టేట మునిగిపోతున్నారు.


